Nara Lokesh: ప్రజాదర్బార్‌లో నారా లోకేశ్..
మంగళగిరి (Mangalagiri) లోని తెలుగు దేశం పార్టీ (TDP) రాష్ట్ర కార్యాలయం ఈరోజు వేలాది మంది ప్రజలతో కిటకిటలాడింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఆధ్వర్యంలో జరిగిన ప్రజాదర్బార్ (Praja Darbar) కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన జనసందోహం నెలకొంది. ముందుగానే ఈ కార్యక్రమం గురించి ప్రకటించడంతో రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలు, పార్టీ నేతలు, సాధారణ ప్రజలు అందరూ భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
యువనేత లోకేశ్‌ను ప్రత్యక్షంగా కలసి తమ సమస్యలు చెప్పుకోవాలనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఆయనను కలిసేందుకు కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. గుంటూరు (Guntur) – విజయవాడ (Vijayawada) హైవే వద్ద కూడా ప్రజల రద్దీ కనిపించింది. తమ సమస్యలను చెప్పేందుకు లైనులో నిల్చున్న వారికి టీడీపీ కార్యకర్తలు మంచినీరు, బిస్కెట్లు, మజ్జిక ప్యాకెట్లు అందిస్తూ సేవలు అందించారు.
లోకేశ్ ప్రతి ఒక్కరి సమస్య ఓపికగా విని స్పందిస్తున్నారు. ఎవరూ నిరాశ చెందకుండా సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. కొందరి సమస్యలకు అక్కడికక్కడే సూచనలు ఇచ్చి, సంబంధిత అధికారులకు దిశానిర్దేశాలు ఇచ్చారు. అందుకే ఆయనను కలిసినవారు సంతోషంగా తిరిగి వెళ్తున్నారు. “లోకేశ్‌ను కలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి” అనే విశ్వాసంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నుంచే నారా లోకేశ్ ప్రజలతో నేరుగా మమేకమవడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ఉండవల్లిలో (Undavalli) ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద కూడా ఆయన రోజువారీ ప్రజాదర్బార్ నిర్వహించేవారు. దాదాపు ఆరు నెలలపాటు ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించారు. ఆ సమయంలో ప్రజలు విపరీతంగా వచ్చేవారు. లోకేష్ ను కలిసి సమస్య చెప్పడమే సరిపోతుందని, ఆయన వెంటనే స్పందిస్తారని ప్రచారం కూడా బలంగా సాగింది. తరువాత మంత్రిత్వ బాధ్యతలు పెరగడంతో, విభాగాల పనుల కారణంగా కొంత కాలం ప్రజాదర్బార్ నిలిపివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయనను కలవాలనే ఉత్సాహం ప్రజల్లో తగ్గలేదు. ప్రతి రోజూ వందల మంది పార్టీ కార్యాలయానికి వచ్చి ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా మంగళవారం పూర్తిగా ఒక రోజు ప్రజల కోసం కేటాయిస్తూ లోకేశ్ మళ్లీ ప్రజాదర్బార్ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత ప్రజలను కలవడం వల్ల ఆయనలోను ప్రత్యేక ఉత్సాహం కనిపించింది. ఉదయం నుంచి లైనులో నిల్చున్నవారు మధ్యాహ్నం భోజన సమయానికీ బయటకు వెళ్లకుండా ఎదురుచూస్తున్నారు. “ఏం అయినా సరే ఈ రోజు లోకేశ్‌ను కలుస్తాం” అనే పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపించింది. జనం తాకిడి పెరగడంతో రాత్రి వరకు కూడా ప్రజాదర్బార్ కొనసాగుతుందని అంచనా. ఎంత సమయం పట్టినా అందరినీ కలుస్తానని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపడమే తన ప్రధాన ధ్యేయమని ఆయన తెలిపారు. ప్రజల నమ్మకానికి తగిన విధంగా వ్యవహరించడం ద్వారా యువనేత మళ్లీ ప్రజలకు చేరువయ్యారు.







