Pakistan: డేంజర్ విమానం కొంటున్న పాక్.. భారత్ కు ఎందుకు కంగారు..?

భారత్(India) విషయంలో కయ్యానికి కాలు దువ్వె పాకిస్తాన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. తనతో సన్నిహితంగా ఉండే చైనా(China)తో పెద్ద ఎత్తున ఆయుధాలు, యుద్ద విమాన కొనుగోలుపై ఫోకస్ పెట్టింది. అటు చైనా కూడా పాకిస్తాన్ కు అత్యాధునిక ఆయుధాలను అందించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే డ్రోన్, క్షిపణి వ్యవస్థల విషయంలో సాయం చేస్తున్న ఆ దేశం ఇప్పుడు యుద్ద విమానాలను అందించింది. 2024 నవంబర్ లో చైనా 5వ జెనరేషన్.. స్టెల్త్ ఫైటర్ J-35 ను ఆవిష్కరించింది.
మల్టీరోల్ మిషన్ల కోసం ట్విన్-ఇంజిన్, సింగిల్-సీటర్ సూపర్‌సోనిక్ జెట్, J-35 అధునాతన టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే, ఎలక్ట్రో-ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్ మరియు ఇన్‌ఫ్రారెడ్ సెర్చ్-అండ్-ట్రాక్ ఉన్నాయి. చైనా ప్రభుత్వ వివరాల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ అయిన అమెరికాకు(America) చెందిన F-35 తో పోలిస్తే, J-35 మరింత సమర్ధవంతంగా పని చేస్తుందని పేర్కొంది. రహస్యంగా పోరాటం చేయడంలో ఈ యుద్ద విమానం సమర్ధవంతంగా పని చేస్తుందని వెల్లడించింది.
ఈ విమానాలను పాకిస్తాన్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇక మరో 20 చైనీస్ విమానాలను కొనుగోలు చేయాలని కూడా పాకిస్తాన్ ప్రణాలికలు రచిస్తోంది. J-10C, JF-17 యుద్ధ విమానాలను ఇప్పటికే పాకిస్తాన్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 40 J-35లను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందని సమాచారం, ఈ సంవత్సరం చివర్లో మొదటి యూనిట్లు అందుబాటులోకి వస్తాయని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ విమానాలను స్టెల్త్ ఫైటర్ గా అభివర్ణిస్తారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో భారత్ కు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానాలు భారత్ వద్ద లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. దీనితో వెంటనే భారత్ ఈ తరహా విమానాలను కొనుగోలు చేయడంపై దృష్టి సారించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ జెట్, ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను.. టార్గెట్ గా చేసుకుని క్షిపణులు వంటి ఇతర ఆయుధ వ్యవస్థలతో సమర్ధవంతంగా దాడులు చేయగలిగే సామర్ధ్యం ఉన్న జెట్ గా చైనా చెప్తోంది.