రెండు దేశాల బంధం మరింత బలోపేతం
చైనా, రష్యా మధ్య సహకార బంధాన్ని మరింత బలోపేతం గావించాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి పలు ఒప్పందాలపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకాలు చేశారు. ఆ తరువాత వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలనే విషయంలో రష్యా, చైనా నిబద్ధతను ఒక సంయుక్త ప్రకటన చాటిచెబుతోంది. ఉక్రెయిన్ సమస్యకు సరైన రాజకీయ పరిష్కారం చూపాలనే దానిపై ఇరు దేశాలు ఏకీభావంతో ఉన్నాయి. పుతిన్ రెండు రోజుల చైనా పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడుతూ రష్యా, చైనా మధ్య సంబంధాలు స్థిరమైనవి, రెండు దేశాల ప్రజల ప్రాథమిక ప్రయోజనాలే కాకుండా ప్రాంతీయ, ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సులకు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు. చైనా, రష్యా రెండూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు, అభివృద్ధి చెందుతున్న ప్రధాన మార్కెట్లని జిన్పింగ్ పేర్కొన్నారు.
పుతిన్ మాట్లాడుతూ చైనాతో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడం, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి ప్రేమ్ వర్కులలలో సన్నిహితంగా కమ్యూనికేట్ చేసుకోవడం, సహకరించుకోవడం, మరింత న్యాయమైన, సమతుల్యతతో కూడిన అంతర్జాతీయ క్రమాన్ని ఏర్పాటు చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, ప్రకృతి పరిరక్షణ, తనికీ, మీడియా వంటి రంగాలలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు సంబంధించి ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.






