Mark Carney: అమెరికాతో వాణిజ్య పోరే : కార్నీ
కెనడా కొత్త ప్రధానిగా ఎన్నికైన మార్క్ కార్నీ (Mark Carney) అమెరికాతో వాణిజ్య యుద్ధానికి సిద్ధమేనని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ముందు అమెరికాతో వాణిజ్య యుద్ధం, జాతీయ ఎన్నికల వంటి సవాళ్లున్నాయి. ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో వాటిపై ఆయన స్పందించారు. మన ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికి మరొకరు ప్రయత్నిస్తున్నారు. ఆయనే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). ఇది మనందరికీ తెలుసు. మనం నిర్మించుకున్న, మనం విక్రయించే వాటిపై అన్యాయమైన సుంకాలను విధించారు. ఆయన కెనడా (Canada) కుటుంబాలు, కార్మికులు, వ్యాపారులపై దాడులు చేస్తున్నారు. ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించనీయం. అమెరికన్లు మనపై గౌరవం ప్రదర్శించే వరకూ ప్రతీకార సుంకాలను విధిస్తూనే ఉంటాం. మనం ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ అలాంటి పరిస్థితి వస్తే కెనడియన్లు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. హాకీ (Hockey) లో మాదిరిగా వాణిజ్యంలో అమెరికా తప్పులు చేయకూడదు. చేస్తే కెనడా విజయం సాధిస్తుంది (ఇటీవల అమెరికాతో జరిగిన హాకీ మ్యాచ్లో కెనడా విజయం సాధించింది) అని కార్నీ పేర్కొన్నారు.






