Canada : కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో భారీ మార్పులు!
ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కెనడా (Canada )ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. నూతన ఇమిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్ నిబంధనలు ఈ ఏడాది జనవరి 31వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. వీటిద్వారా ఇమిగ్రేషన్, బోర్డర్ అథారిటీ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. స్టడీ వీసాలు(Study visas), వర్క్ వీసాల (work visas) తోపాటు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసాలు( టీఆర్వీ) రద్దు చేసే అధికారం దక్కింది. వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు, సైతం రద్దు చేయొచ్చు. ఈ కొత్త నిబంధనల వల్ల వేలాది మంది విదేశీయులకు నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా కెనడాలో ఉంటున్న భారతీయుల (Indians)పై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు.
విద్యార్థులు, ఉద్యోగస్థులు, టెంపరరీ రెసిడెంట్ విజిటర్లకు ఇబ్బందులు ఎదురు కానున్నాయని పేర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నేర చరిత్ర ఉన్నట్లు తేలినా కెనడా అధికారులు వీసాలు రద్దు చేస్తారు. వీసా గడువు ముగిసినా సదరు వీసాదారుడు కెనా నుంచి వెళ్లే అవకాశం లేదని అధికారులు భావిస్తే వీసా రద్దు కావొచ్చు. వీసా పత్రాలను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా, ధ్వంసమైనా, తప్పుడు సమాచారంతో ఆ వీసా మంజూరు చేసినట్లు గుర్తించినా రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త నిబంధనల వల్ల 7,000 వీసాలు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కొన్ని రెసిడెంట్ వీసాలు (Resident visas), వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లపై వేటు తప్పదని అంటున్నారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు కెనడా వైపు అధికాంగా మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడిరచింది.






