Britain: యూకే వెళ్లాలనుకుంటున్న భారతీయులకు షాక్
పర్యాటకులతోపాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ (Britain)కు వెళ్లే విద్యార్థుల (Students) పై మరింత ఆర్థికభారం పడనుంది. స్టూడెంట్ , విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఆర్నెల్ల బ్రిటన్ వీసా ఫీజు (Visa fees) 115 పౌండ్లు (రూ.12,770) ఉండగా, పది శాతం పెరిగి 127 పౌండ్ల (రూ.14,103)కు చేరనుంది. రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెరిగింది. విద్యార్థి వీసాలపైనా ఈ పెరుగుదల ప్రభావం కనిపించనుంది. ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 (రూ.54,430) పౌండ్లు చెల్లించాల్సి ఉండగా, త్వరలో అది 524 (రూ.58,192) పౌండ్లకు చేరనుంది. ఛైల్డ్ స్టూడెంట్ వీసా (Child Student Visa ) లకూ ఇదే పెంపు వర్తిస్తుంది. ఆరు నెలల నుంచి 11 నెలల స్వల్ప కాలపరిమితి ఇంగ్లిష్ (English ) కోర్సు చదివే విద్యార్థుల ఫీజు కూడా 14 పౌండ్లు పెరగనుంది.






