Bangladesh: అందితే జుట్టు… అందకుంటే కాళ్లు.. హసీనా అప్పగింతపై బంగ్లాదేశ్ వ్యవహారశైలి..

తానేంటో.. తన బలమెంత.. తన ప్రత్యర్థిగా భావించిన దేశానికి ఏం బలముందన్నది తెలుసుకుని వ్యవహరించాలన్నది యుద్ధనీతి. కానీ బంగ్లా దేశ్ మాత్రం.. తన ప్రత్యర్థిగా పొరుగున ఉన్న భారత్ ను భావిస్తోంది. మొన్నటి వరకూ తన మిత్రదేశంగా భావించిన బంగ్లాదేశ్..నాయకత్వం మారగానే స్టాండ్ మార్చేసింది. అంతేకాదు… ఇండియా తమకు ముప్పుగా భావిస్తున్న చైనా, పాకిస్తాన్ తో చెలిమి పెంచుకుంటోంది. అంతే కాదు.. ఆయాదేశాల్లో పర్యటించేటప్పుడు.. భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేసింది. ఇదంతా చూసిన భారత్… ఆచితూచి స్పందిస్తోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రవర్తిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత బంగ్లాదేశ్ కు కాస్త తత్వం అర్థమైందని చెప్పొచ్చు. మొన్న బెదిరింపులు.. తర్వాత హెచ్చరికలు..ఇప్పుడు బతిమాలడం.. బంగ్లా దేశ్ నాయకత్వం వంతైంది.భారత్‌లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)ను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి కోరింది. సుదీర్ఘంగా చేస్తున్న ఈ అభ్యర్థనపై న్యూఢిల్లీ మనస్సాక్షితో వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈమేరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ (Muhammad Yunus) పేరుతో ఆయన ప్రెస్ సెక్రటరీ సామాజిక మాధ్యమాల్లో ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ (Bangladesh) పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నా దీనిపై భారత్ స్పందించడం లేదు. ఈ విషయాన్ని సుదీర్ఘకాలం పొడిగించడం సబబు కాదు. మానవాళిపై నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి భారత్ రక్షణ కల్పించకూడదు. పౌరులను ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వ్యక్తులను ఏ ప్రాంతీయ బంధం, ఏ రాజకీయ వారసత్వం కాపాడలేదు. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సమగ్రత ఉమ్మడి విలువను భారత్ గౌరవించాలని కోరుతున్నాం’’ అని యూనస్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతటి శక్తిమంతమైన నాయకులైనా చట్టానికి అతీతం కాదని, బాధితులకు న్యాయం జరగాల్సిందేనని స్పష్టంచేశారు.
విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌లో తలదాచుకుంటున్నారు. నిరసనల సమయంలో ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులైన హిందూ మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హసీనాపై హత్య సహా పలు అభియోగాలపై కేసులు నమోదు చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష వేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ తీర్పు వెలువరించింది. ఈ క్రమంలోనే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.