US: పాకిస్తాన్ పై అమెరికన్ మీడియా సంచలన కథనం

భారత్ – పాకిస్తాన్(Pakistan) సరిహద్దుల్లో, పాకిస్తాన్ – ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న ఆగడాలపై న్యూ యార్క్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. డ్రోన్ లతో పాకిస్తాన్ సైనికాధికారులు చేస్తున్న కార్యాకలాపాలపై తన కథనంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయగా.. ఆ తర్వాత పాకిస్తాన్ డ్రోన్(Drone) లతో భారత్ పై దాడులకు ప్రయత్నాలు చేయగా వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్ధవంతంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే.
భారత ఆర్మీతో పాటుగా, పౌరులు ఉండే ప్రాంతాల్లో సైతం దాడులు చేసేందుకు పాకిస్తాన్ డ్రోన్ లను వినియోగించింది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ డ్రోన్ లతో దాడి చేసే సామర్ధ్యాన్ని పెంచుకుందని.. దీనితో భారత్ పై దాడులు చేయడానికి వ్యూహాలు రచించింది అని తెలిపింది. డ్రోన్ కార్యకలాపాలు గణనీయంగా పాకిస్తాన్ పెంచిందని కూడా వెల్లడించింది. దీనిపై పాకిస్తాన్ అధికారులు తమను తాము సమర్ధించుకున్నా.. కథనంలో మాత్రం న్యూ యార్క్ టైమ్స్ పాక్ ఆర్మీ చేష్టలను బయటపెట్టింది.
ఈ సంవత్సరం ప్రారంభంలో, పాకిస్తాన్ భద్రతా దళాలు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డ్రోన్‌లతో ఉగ్రవాదుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా.. ఉగ్రవాదుల కంటే సాధారణ పౌరులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ దాడుల్లో మృతుల్లో ఎక్కువగా మహిళలు చిన్నారులు ఉన్నారని న్యూ యార్క్ టైమ్స్ పేర్కొంది. గత నెల చివర్లో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని లోయర్ సౌత్ వజీరిస్తాన్‌లో వాలీబాల్ మ్యాచ్ చూస్తున్న జనంపై అనుమానిత డ్రోన్ దాడిలో కనీసం 20 మంది గాయపడ్డారట.
గత నెలలో, ఉత్తర వజీరిస్తాన్‌లో జరిగిన డ్రోన్ దాడిలో నలుగురు పిల్లలు మరణించినట్లు సమాచారం. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్లే కారణమని అధికారులు ఆరోపించినా.. పాక్ సైన్యం డ్రోన్ దాడే కారణం అని న్యూ యార్క్ టైమ్స్ వెల్లడించింది. తమ సరిహద్దుల్లోని ఉగ్రవాదులపై డ్రోన్‌లను ఉపయోగిస్తున్న నాలుగు దేశాలలో పాకిస్తాన్ ఒకటి. అమెరికా ఇస్తున్న నిధులను ఎక్కువగా డ్రోన్ లు కొనడానికి పాకిస్తాన్ వినియోగిస్తుందని పేర్కొంది. దీనిని కట్టడి చేయకపోతే పాకిస్తాన్ సరిహద్దు దేశాలకు ప్రమాదకరమని హెచ్చరించింది న్యూ యార్క్ టైమ్స్.