Bejing: డ్రాగన్ అస్సలు తగ్గడం లేదు..చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా కాబుల్ వరకు విస్తరణ..!

చైనా- పాకిస్థాన్ ఆర్థిక నడవా(CPEC)ను ఆఫ్గానిస్థాన్‌లోకి విస్తరించాలని మూడు దేశాల నేతలు నిర్ణయించారు. బీజింగ్‌లో జరిగిన ఓ సమావేశంలో పాక్ డిప్యూటీ ప్రధాని ఇస్సాక్ దార్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ, అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాకీలు చర్చలు జరిపారు. ఈ భేటీలో సిపెక్ విస్తరణపై నిర్ణయం తీసుకున్నట్లు పాక్ విదేశాంగశాఖ ప్రకటించింది.
ప్రస్తుతం పాక్ డిప్యూటీ పీఎం, విదేశాంగ మంత్రి ఇస్సాక్ దార్ మూడు రోజులపాటు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత పాక్ మంత్రి చేపట్టిన తొలి చైనా యాత్ర ఇదే. ‘‘పాకిస్థాన్, చైనా, అఫ్గానిస్థాన్‌లు ప్రాంతీయ శాంతి, సుస్థిరత అభివృద్ధికి కట్టుబడి ఉంటాయి. దౌత్య సంబంధాలు కొనసాగించడం, కమ్యూనికేషన్లను బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి వంటివే కీలకమైనవి. చైనా-పాక్ ఆర్థిక నడవాను అఫ్గాస్థాన్ వరకు పొడిగించేందుకు అంగీకరించాం అని ఇషాక్ దార్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మూడు దేశాల విదేశాంగ మంత్రులతో మరో సమావేశాన్ని కాబుల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
మరోవైపు 60 బిలియన్ డాలర్లతో చేపట్టిన సిపెక్‌ను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం(POK) కూడా ఉండటం దీనికి ప్రధాన కారణం. చైనా నుంచి పాక్ బలూచిస్థాన్‌లోని గ్వదర్ వరకు సాగే సిపెక్ చాలా కీలకమైంది. చైనా నౌకలు పర్షియన్ సింధు శాఖ ద్వారా పయనిస్తూ ఎగుమతి, దిగుమతులు నిర్వహిస్తాయి. ఆ సింధు శాఖ మార్గాన్ని కాపాడుకోవడానికి సిపెక్‌లో భాగంగా గ్వదర్ రేవు నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చైనా నౌకలు మలక్కా జలసంధిపై ఆధారపడటం తగ్గిపోతుంది.