ఫేస్బుక్ ప్రేమ.. 78 ఏళ్ల అమెరికన్ వృద్ధురాలు.. భారత్‌లో
సామాజిక మాధ్యమాల వేదికగా చోటుచేసుకునే కొన్ని పరిచయాలు పెళ్లి వరకు దారితీస్తున్న ఘటనలు చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడితో లేటు వయసులో అమెరికన్ వృద్ధురాలు ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా భారత్‌కు వచ్చి పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన జాక్వెలిన్ ఆస్టిన్ (78)కు భారత్‌కు చెందిన భరత్ జోషీ(34)తో పరిచయం ఏర్పడింది. వారి ఫేస్బుక్ స్నేహం చివరకు ప్రేమగా మారింది. గతేడాది ఆగస్టులో రాజస్థాన్‌లోని కోటాకు వచ్చిన ఆమె, జోషిని పెళ్లి చేసుకుంది. అదే సమయంలో అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులతోనూ ఆమె టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ఆస్టిన్ అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆసుసత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో జైపుర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు కన్నుమూసినట్లు పోలీసులు వెల్లడించారు.






