Indians : అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారులు 636 మంది
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 636 మంది భారతీయల (Indians) ను అమెరికా (America) వెనక్కి పంపించింది. వీరిలో 341 మంది చార్టెర్డ్ విమానాల్లో, 55 మంది పనామా నుంచి వాణిజ్య విమానాల్లో, మిగతా 240 మంది వేర్వేరు వాణిజ్య వవిమానాల్లో చేరుకున్నారని లోక్సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతి వర్దన్ (Kriti Vardhan) సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అమెరికాలో ఉంటున్న 18 వేల మంది భారతీయ అక్రమ వలసదారులను వాపను తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వచ్చిన వార్తలపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ (Yusuf Pathan) ప్రశ్నించగా, విదేశాల్లో ఉండే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత దేశాలదేనని మంత్రి తెలిపారు. తమ నిర్బంధంలో ఉన్న మరో 295 మంది వ్యక్తుల సమాచారాన్ని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (US Immigration and Customs Enforcement) విభాగం మన అధికారులకు అందజేసిందని మంత్రి తెలిపారు. వీరు మన జాతీయులేనా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వం తిప్పి పంపేవారికి అవసరమైన సాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు.






