Dependent Visa : డిపెండెంట్ వీసా గడువు తీరినవారు 1.34 లక్షల మంది!
తల్లిదండ్రులతో కలిసి డిపెండెంట్ వీసాల (Dependent Visa )పై భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన వారిలో 1.34 లక్షల మందికి వీసా గడువు తీరిపోయింది. దీంతో వీరంతా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోంది. విశ్వవిద్యాలయాల్లో చేరి విద్యార్థి వీసాలను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారంతా అమెరికాలో ఉండగలరు. లేదంటే భారత్ (India)కు తిరిగి రావాల్సి వస్తుంది. హెచ్1బీ (H1B) వీసాదారుల పిల్లలు డిపెండెంట్ వీసా కింద అమెరికాకు వెళ్లవచ్చు. మైనర్‌గా వెళ్లిన వీరికి 21 ఏళ్లు నిండే వరకూ ఈ వీసా పని చేస్తుంది. అనంతరం కొత్త వీసా పునరుద్ధరణకు రెండేళ్లు గడువు ఉంటుంది. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగింపు దశకు చేరుకున్న భారతీయ చిన్నారుల సంఖ్య దాదాపు 1.34 లక్షలుగా ఉన్నట్లు సమాచారం. వీసా గడువు ముగిసేవారు ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 వీసా (F-1 visa) పొందే అవకాశం ఉంది. అయితే ఇది అనేక సవాళ్లతో ముడిపడి ఉంటుంది.






