దేశవ్యాప్తంగా లాక్డౌన్ 31 వరకు పొడిగింపు…కేంద్రం
అందరూ అనుకున్నట్టే లాక్‌డవున్ 4 వివరాలను ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డవున్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. నేటితో మూడో విడత లాక్డౌన్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలను జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ వెల్లడిస్తుందని ఎన్డీఎంఏ తెలిపింది. ఇటీవల జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించినప్పుడు సైతం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 17 తర్వాత కూడా లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. అయితే ఏ తేదీ వరకు అనేది వెల్లడించనప్పటికీ పలు మార్పు చేర్పులతో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
నాలుగో విడత లాక్డౌన్లో పలు మినహాయింపులు ఇచ్చారు. కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను మే 31 వరకు తెలంగాణ 29 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకే బాధ్యత.. గత కొన్ని రోజులుగా రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని, కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని పలు రాష్ట్రాల సిఎంలు ఆరోపిస్తున్న నేపధ్యంలో ప్రజారవాణా, అంతర్రాష్ట్ర రవాణా పునరుద్ధరణలపై ఆయా రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. ఇక రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
అయితే దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా వ్యవహరించాల్సిందేనని, ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతాలిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని తేల్చి చెప్పింది. ఇక హోటళ్లు, రెస్టారెంట్స్ అనుమతించబోమని, అయితే అవి ఫుడ్ డోర్ డెలివరీ చేసుకోవడానికి అభ్యంతరం లేదని వెసులుబాటుని ఇచ్చింది. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరచుకోవచ్చు కాని ప్రేక్షకులతో కూడిన ఆటలను అనుమతించమని స్పష్టం చేసింది. ప్రార్ధనా మందిరాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు, ప్రదర్శనలు… వేటికీ అనుమతి లేదని పెళ్లికి కేవలం 50 మందితో మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. అంతిమయాత్రలో 20 మందికి మించకూడదని షరతు విధించింది. జిమ్‌లు, ధియేటర్స్, మాల్స్, స్కూల్స్ పై లాక్‌డవున్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. మొత్తం మీద లాక్ డవున్ 4 కూడా పరిమితమైన సడలింపులతో మాత్రమే ఉండడం అంటే కేంద్రం కరోనా పట్ల కఠిన వైఖరిని చెప్పకనే చెప్పినట్టయింది.






