గాలి ద్వారా వేగంగా కరోనా వైరస్
గాలి ద్వారా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని అమెరికాలోని శాన్‌డియాగో విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ బృందంలో 1995లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న మారిస్ జే మోలినా అనే శాస్త్రవేత్త కూడా ఉన్నారు. చైనాలోని వూహాన్, ఇటలీ, న్యూయార్క్ నగరాల్లో జనవరి 23 నుంచి మే 9 వరకు కేసుల సంఖ్య పెరుగుతున్న ధోరణిని వీరు పరిశీలించారు. ఆయా నగరాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి గాలి ప్రధాన మాధ్యమంగా నిలిచింది. కరోనా బాధితులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపరలను ఇతరులు పీల్చడం ఇందుకు కారణమైంది. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి రక్షణాత్మక చర్యలు చేపట్టిన తరవాత పరిస్థితుల్లో వచ్చిన మార్పులనూ విశ్లేషించారు.






