నా మనసు మారిపోయింది..ఇక వెనక్కు తగ్గను
సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సిరియాలో పోరాటం హద్దులు మీరిందని, ఐక్యరాజ్య సమితి సంకీర్ణ దళాలు కలిసి రాకపోయినా అమెరికా సైన్యాన్ని పంపిస్తామని ఆయన సృష్టం చేశారు. ఈ రసాయన దాడి తనను కలచివేసిందని, ఎంతో మంది అమాయక చిన్నారులు బలికావడం బాధాకరమని అన్నారు. ఎన్నో హద్దులను దాటేశారని, ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదని ట్రంప్ అబిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల ఏరివేత ఇక నా బాధ్యత. ఈ దాడితో నా మనసు మారిపోయింది. ఇక ఇస్లామిక్ స్టేట్‌ను ఓడించడంపై ప్రత్యేక దృష్టిని సారిస్తా అని జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో కలిసి రోజ్ గార్డెన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపారు. చిన్నారులపై దాడి తనపై పెను ప్రభావాన్ని చూపిందని, ఇంత కన్నా ఘోరమైన దుర్ఘటనను తానింత వరకూ చూడలేదని అన్నారు. సిరియాలో శాంతిని నెలకొల్పడంలో సమితి పదేపదే విఫలమవుతోందని విమర్శించిన ట్రంప్ బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పారు.






