బోస్టన్ లో ఘనంగా శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు
బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం, శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలు చాలా వైభవంగా ఏప్రిల్ 22, 2017 శనివారం నాడు అల్గోన్క్విన్ హైస్కూల్, Northborough, MA లో జరిగాయి. ఈ ఉగాది వేడుకల లో స్థానికుల ప్రతిభ తో పాటు DhimTANA పాటల, నృత్య పోటీలు, మరియు ప్రసిద్ధ కళాకారులైన Dr. ఘజల్ శ్రీనివాస్ గారు ఆలపించిన అద్భుతమైన ఘజల్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. 900 మందికి పైగా తెలుగు వారు ఈ వేడుకల లో పాల్గొన్నారు. సుమారు 300 మంది పిల్లలు, యువకులు, పెద్దలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల లో పాల్గొని విచ్చేసిన ఆహుతులను అలరించారు.
TAGB నూతన కార్యవర్గం తమ ఆధ్వర్యం లో ఎంతో నేర్పుతో, ఓర్పుతో నాటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆహుతులకి అందజేశారు. ఈ కార్యవర్గం వారు , విచ్చేసిన ప్రేక్షకులందరికీ షడ్రుచులు మిళితమైన చక్కని ఉగాది పచ్చడి అందించి స్వాగతం పలికారు. స్వాగత ద్వారం వద్ద స్వచ్ఛంద సేవకులు ఎంతో అందంగా మన సాంప్రదాయ అలంకరణల తో తీర్చిదిద్దారు. చూపరులను ఈ అలంకరణలు ఎంత గానొ ఆకట్టుకున్నాయి అంటే అతిశయోక్తి కాదు.
TAGB సంస్థ ఈ నాటి ఉగాది వేడుకలలో భాగంగా DhimTANA గాన, నృత్య పోటీలు నిర్వహించటాన్ని సులభతరం చేసారు. నాటి ఉగాది వేడుకలు ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ బచ్చు గారు మరియు కల్చరల్ సెక్రటరీ శ్రీమతి దీప్తి గోరా గారు జ్యోతి ప్రజ్వలన చేసిన పిదప వారి స్వాగత పలుకుల తో ప్రారంభమయ్యాయి. చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక గానామ్రుతములతో, శ్లోకములు, భజనల తో ప్రారంభమై, డాన్సు మెడ్లీల సందడులతో, శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్శనల తో, ధ్యురోధన ఏకపాత్రాభినయం, హాయిగా కడుపుబ్బా నవ్వించిన నాటికలతో ముందుకు సాగుతూ 8 గంటల పాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 52 కి పైగా ప్రదర్శనామ్సములతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.
ఉగాది అంశగా నడచిన షడృచోపేతమైన మధురమైన కవితా గోష్టి భావుకులకు, కవితా ప్రియులైన శ్రోతలకు వీనుల విందు చేసింది. మొట్టమొదటి సారిగా మగవారు, యువకులు ఉర్రూతలూగించే నేపధ్య సంగీతానికి రాంప్ మీద నడిచిన “Lion Walk” నాటి కర్యక్రమంలో ఒక ప్రత్యేక అకర్షణగా ప్రేక్షకుల మన్నన పొందిOది.
నాటి వేడుకలకు ముందుగా పిల్లలకు ప్రత్యేకంగా నీతి పద్యముల పోటీలు నిర్వహించ బడ్డాయి. సభ్యులు బహుమతులను అందజేశారు.
నాటి కార్యక్రమములలో భాగంగా TAGB వారు తమ నూతన కార్యవర్గ సభ్యులను ప్రేక్షకులందరికీ పరిచయం చేసారు. ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ బచ్చు గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ ని పరిచయం చేసారు , శ్రీమతి మణిమాల చాలుపడి (ప్రెసిడెంట్ ఎలెక్ట్), శ్రీ ప్రదీప్ పెనుబోలు (సెక్రటరీ), శ్రీ సీతారాం అమరవాది (కోశాధికారి), శ్రీమతి దీప్తి గోరా (కల్చరల్ సెక్రటరీ), శ్రీ రామకృష్ణ పెనుమర్తి (జాయింట్ సెక్రటరీ), శ్రీమతి సత్య పరకాల (జాయింట్ ట్రేసరర్ర్), బోర్డు అఫ్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ కొల్లిపర, శ్రీ శశికాంత్ వల్లేపల్లి (ఉప అధ్యక్షులు), శ్రీ మూర్తి కన్నెగంటి, శ్రీ రాజా చిలకమర్రి, శ్రీ శంకర్ మగాపు, శ్రీ చంద్ర తాళ్లూరి మరియు శ్రీమతి పద్మావతి పరకాల. అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ బచ్చు గారు కొత్త కొత్త కార్యక్రమాలు అందించడానికి TAGB కృషి చేస్తుందని ప్రమాణం చేసారు.
నాటి సాయంకాలం అత్యంత ప్రత్యేక ఆకర్షణగా నిలచిన కార్యక్రమము ప్రపంచ గిన్నిస్ రికార్డ్ గ్రహిత ఘజల్ మాస్ట్రో, Dr. ఘజల్ శ్రీనివాస్ గారు పాడిన ఘజల్స్ సభికుల మనసుల్లో చిరస్మరణీయం గా నిలచిపోతాయి. వారు తమ ఘజల్స్ తో అందరిని చిన్నతనం లో చూసిన పల్లె ప్రపంచం లో, పచ్చని పైరుల్లో విహరింప జేసి మంత్రముగ్ధులను చేసారు. వారు ఘజల్స్ పాడుతున్నంత సేపు ఆడిటోరియంలో ఉన్న అన్ని వయసులవారు కటిక నిశబ్దాన్ని పాటిస్తూ గంట సేపు సాగిన ఈ గానామృతాన్ని ఎంతో ఇష్టంగా ఆశ్వాదించారు. ఈ ఘజల్స్ వినిపించిన Dr. ఘజల్ శ్రీనివాస్ గారిని ప్రేక్షకులందరూ ముక్త కంఠముతో, కరతాళ ధ్వనులతో కొనియాడారు.
నాటి సాయంత్రము ప్రదర్శనల తో పాటు ఆ ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చిన వారిని ఆకట్టుకున్నాయి. వివిధ రకములైన ఆభరణములు , వస్త్రముల అంగడులు , సాంఘిక సేవాసంస్థలు మరియు సైన్స్ సంబంధించిన వివరములు అందించే అంగడుల తో ఆవరణమంతా జన సందోహముతో క్రిక్కిరిసిపోయింది. ఈ సారి బంగినిపల్లి మామిడిపళ్ళు అంగడిలో అమ్మకానికి వచ్చాయి. నిజమండి… నమ్మండి ! కొనే వారి సందడే సందడి.
నాటి సాయంత్రము బిర్యానీ పాయింట్ మరియు మయూరి రెస్టారంట్ వారు విచ్చేసిన ఆహుతులకు రుచికరమైన భోజనాన్ని అందించారు.
ఎంతో కృషిని , సమయాన్ని వెచ్చించి నాటి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్సకులకు , వారి తల్లితండ్రులకు , విచ్చేసిన ప్రేక్షకులకు, వాలంటీర్లకు, TAGB కార్యవర్గ సభ్యులకు, మరియు దాతలకు, TAGB ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ బచ్చు గారు మరియు సెక్రటరీ శ్రీ ప్రదీప్ పెనుబోలు గారు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
భారత జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఆహ్లాదపరచిన నాటి కార్యక్రమానికి తెరపడింది. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు వారికి ఈ నాటి కార్యక్రమం మరో చక్కని జ్ఞాపకంలా నిలిచి పోతుందని అనటం లో అతిశయోక్తిలేదు !!













