అప్పటివరకూ అంతరిక్షంలోనే సునీత విలియమ్స్ ?
మూడోసారి రోదసీలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరక్షి కేంద్రం (ఐఎస్ఎస్)లోనే ఉండనున్నారు. సునీత, విల్మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 14న వారు భూమికి తిరిగి రావాల్సింది. అయితే, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో రెండు నెలలుగా వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే వ్యోమగాముల రాకపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది. బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమ్మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయంగా స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో వెనక్కి రప్పించే వీలుంది. 2025 ఫిబ్రవరిలో అందుకు అవకాశం కుదురుతుంది అని నాసా పేర్కొంది. ఈ లెక్కన అప్పటివరకూ సునీత, విల్ మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండే అవకాశాలు కన్నిస్తున్నాయి.







