TVK Vijay: పొత్తులపై విజయ్ సంచలన నిర్ణయం..!
తమిళనాడు (Tamilnadu) రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీలన్నీ కసరత్తులు చేస్తున్నాయి. కొత్తగా రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రముఖ నటుడు, దళపతి విజయ్ (Thalapathy Vijay) ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే తమ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతుందని విజయ్ ప్రకటించారు. మహాబలిపురంలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో తమిళనాట రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోరు అనివార్యంగా కనిపిస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించింది. బీజేపీతో (BJP) టీవీకే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ఊహాగనాలకు ఈ ప్రకటనతో తెరపడింది. అంతేకాక పార్టీ అధినేత విజయ్ స్వయంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని అధినేత విజయ్ కి పార్టీ జనరల్ కౌన్సిల్ కట్టబెట్టింది. అయితే, పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని విజయ్ చెప్పడంతో ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు అర్థమవుతోంది.
సమావేశంలో మొత్తం 12 కీలక రాజకీయ తీర్మానాలకు జనరల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానంగా అధికార డీఎంకే ప్రభుత్వంపై, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎంకే, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో రెండూ వెనుకబడ్డాయని విజయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, అవినీతి పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. అవినీతిమయమైన బీజేపీతో కలిసి పోటీ చేసే ఆలోచన లేదని విజయ్ స్పష్టం చేశారు.
దళపతి విజయ్ ప్రకటనతో తమిళనాడు రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని తేల్చేశాయి. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు ఈసారి కూడా కలసికట్టుగా బరిలోకి దిగనున్నాయి. ఇక అన్నాడీఎంకే, బీజేపీతో కలిసి పోటీ చేయనుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఒంటరిగా బరిలోకి దిగనుంది. ఆ రెండు కూటములను ఓడించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. విజయ్ పార్టీ, డీఎంకే, అన్నాడీఎంకే వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చే అవకాశం ఉంది. అభిమానుల్లో, యువతలో ఉన్న ఫాలోయింగ్ టీవీకేకు ప్లస్ పాయింట్. అయితే, పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం కావాల్సి ఉంది.
ఒంటరిగా పోటీ చేయాలనే విజయ్ నిర్ణయం డీఎంకేకు, అన్నాడీఎంకేకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. ఒకవైపు డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే అవకాశం ఉండగా, మరోవైపు విజయ్ ప్రకటన ప్రాంతీయ పార్టీల కూటముల సమీకరణాలను సంక్లిష్టం చేసింది.







