ఆ వీసాలను ట్రంప్ సర్కారు రద్దు చేయనుందా?
అమెరికా హెచ్-4 డిపెండెంట్ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల జీవితభాగస్వాముల్లో వారి భవితవ్వంపై ఆందోళన, అసృష్టత మరికొంత కాలం కొనసాగనున్నాయి. వారి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. వారిని ఉద్యోగాలు చేసుకోవడానికి అనుమతించే నిబంధనను రద్దుచేయాలా, వద్దా అనే అంశాన్ని పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలిపేందుకు గడువును సెప్టెంబరు 27 వరకు పొడిగించాలని ఓ అప్పీళ్ల కోర్టును డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోరింది. హెచ్-4 వీసాదారుల్లో అత్యథికులు భారతీయులే. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్క్ వీసాలు జారీ చేయాలని 2015లో అమెరికా సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 2 లక్షల మంది జీవిత భాగస్వామి వీసా(హెచ్-4) లపై అమెరికాలో నివసిస్తున్నారు. వారిలో అధిక శాతం వివిధ ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సర్కారు నిర్ణయాన్ని 2015లోనే కాలిఫోర్నియాకు చెందిన కొందరు ఐటీ ఉద్యోగులు కింది కోర్టులో దావా వేశారు. కేసును 2016లో కింది కోర్టు కొట్టివేసింది. తీర్పును హైకోర్టులో సవాలు చేశారు. ఇంతలో ట్రంప్ సర్కారు అధికారంలోకి రావడంతో ఈ కేసులో సమాధానం చెప్పేందుకు తమకు 60 రోజులు గడువు కావాలని కోర్టును కోరింది. ఈ గడువు ముగియడంతో విచారణను మరో ఆరు నెలలు ఆపాలంటూ వాషింగ్టన్ డీసీ సర్క్యూట్ అప్పీలు కోర్టును ట్రంప్ సర్కారు కోరింది.






