TAGS: శాక్రమెంటోలో ఘనంగా ‘నాట్య గాన కళా వేదిక’
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, రాంచో కార్డోవా (Rancho Cordova) వేదికగా తెలుగు సంస్కృతి పరిమళించింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ శాక్రమెంటో (TAGS) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నాట్య గాన కళా వేదిక’ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్డోవా హైస్కూల్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరిగిన ఈ వేడుకకు సుమారు 500 మందికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి.
సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, భరతనాట్యంతో పాటు కర్ణాటక సంగీత కచేరీలు, భక్తి గీతాలాపనలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు విశేష ఆదరణ పొందాయి. కేవలం వినోదమే కాకుండా సామాజిక బాధ్యతలోనూ తాము ముందుంటామని చాటుతూ, ట్యాక్స్ (TAGS) నిర్వాహకులు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ‘వైటలెంట్ బ్లడ్ బ్యాంక్’ సహకారంతో 15 మందికి పైగా దాతలు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా సువిధ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు భాస్కర్ వెంపటిని (Bhaskar Vempati) టాగ్స్ (TAGS) అధ్యక్షుడు శ్యామ్ యేలేటి, చైర్మన్ నాగ్ దొండపాటి ఘనంగా సత్కరించారు. విజయవంతమైన ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లను అభినందించారు. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే సంక్రాంతి సంబరాలకు (Sankranti Sambaralu) అందరూ విచ్చేయాలని ఆహ్వానించారు.






