Indians Arrest: అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్ట్
అమెరికాలో అక్రమ వలసదారులపై నిఘా పెంచిన అక్కడి అధికారులు తాజాగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో దేశంలో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయ పౌరులను (Indians Arrest) యూఎస్ బోర్డర్ పెట్రోల్ సిబ్బంది అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టార్ పరిధిలో ఉన్న ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద ఈ అరెస్టులు జరిగినట్లు సమాచారం.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులను ఉపయోగించి సెమీ ట్రక్కులను నడుపుతున్న మొత్తం 49 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికంగా 30 మంది భారతీయులే (Indians Arrest) ఉండటం గమనార్హం. మిగిలిన వారిలో చైనా, రష్యా, మెక్సికో, ఉక్రెయిన్, ఎల్ సాల్వడార్, సోమాలియా తదితర దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు.
ఇటీవల కాలంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు ట్రక్కులు నడుపుతూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు గుర్తించిన అధికారులు.. ఈ తనిఖీలను ముమ్మరం చేసినగ్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారతీయులు (Indians Arrest) సహా ఇతర దేశాల వారు పట్టుబడ్డారు. వీరంతా చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్నారని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ధ్రువీకరించింది. విచారణ అనంతరం వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.






