TTA: చుక్కా రామయ్యకు ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పురస్కారం.. సత్కరించిన టీటీఏ బృందం
TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) 10వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని విద్యా రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా సుపరిచితులైన చుక్కా రామయ్యను ఘనంగా సత్కరించింది. హైదరాబాద్లోని ఆయన నివాసంలో టి.టి.ఏ నాయకత్వ బృందం చుక్కా రామయ్యను కలిసి, ఆయనకు టి.టి.ఏ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ (TTA Excellence in Education Award) అవార్డును ప్రదానం చేసింది. ఈ గౌరవప్రదమైన కార్యక్రమంలో టి.టి.ఏ తరపున శివారెడ్డి కొల్లా (టి.టి.ఏ జనరల్ సెక్రటరీ), సంగీత రెడ్డి (10వ వార్షికోత్సవ అవార్డుల కమిటీ చైర్), రామ వనమ (10వ వార్షికోత్సవ సాంస్కృతిక కమిటీ అడ్వైజర్) తదితరులు పాల్గొన్నారు. చుక్కా రామయ్య, వారి కుటుంబ సభ్యులను కలవడం సంతోషంగా ఉందని టి.టి.ఏ ప్రతినిధులు పేర్కొన్నారు.
విద్యా రంగంలో ఆయన చేసిన నిరంతర సేవలు, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. భావితరాలకు ఆయన ఒక మార్గదర్శి అని, అటువంటి మహోన్నత వ్యక్తిని గౌరవించుకోవడం సంస్థకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని టి.టి.ఏ నాయకత్వం ప్రకటించింది.






