India Post: యూఎస్‌కు పార్శిల్ సర్వీసులు నిలిపివేస్తున్న భారత పోస్టల్ శాఖ!

భారత పోస్టల్ (India Post) విభాగం యూఎస్‌కు (USA) పార్శిల్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆగస్టు 25 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. అమెరికా నిబంధనల ప్రకారం, గతంలో $800 కన్నా తక్కువ విలువ గల వస్తువులకు కస్టమ్స్ సుంకాల నుండి మినహాయింపు ఉండేది. కానీ ఆగస్టు 29 నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి. ఇకపై $100 కన్నా తక్కువ విలువ గల బహుమతులు, లేఖలకు మాత్రమే కస్టమ్స్ డ్యూటీ నుండి మినహాయింపు ఉంటుంది. మిగిలిన అన్ని వస్తువులపై సుంకాలు (Customs Duty) వర్తిస్తాయి.
ఈ మార్పుల నేపథ్యంలో, భారత పోస్ట్ (India Post) విభాగం కేవలం $100 లోపు విలువ గల బహుమతులు, లేఖలను మాత్రమే యూఎస్‌కు పంపనుంది. మిగతా అన్ని పోస్టల్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. కేవలం భారత పోస్టల్ శాఖే కాకుండా, డీహెచ్‌ఎల్ (DHL), రాయల్ మెయిల్ (Royal Mail) వంటి ఇతర ప్రముఖ కొరియర్ సంస్థలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌తో పాటు స్కాండనేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం వంటి దేశాలు కూడా అమెరికాకు తమ పార్సిల్ సేవలను (Parcel Services) నిలిపివేశాయి.
కొత్తగా వసూలు చేసే సుంకాలపై (Customs Duty) స్పష్టత లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. సుంకాలను అర్హత కలిగిన ఏజెన్సీలు వసూలు చేస్తాయని యూఎస్ (USA) ప్రకటించినప్పటికీ.. సదరు ఏజెన్సీలు ఏవి? సుంకాలు ఎలా వసూలు చేస్తారు? వంటి వివరాలు వెల్లడించలేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత పోస్టల్ (India Post) అధికారులు అమెరికా కస్టమ్స్ విభాగంతో, అలాగే విదేశాంగ, వాణిజ్య శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నారు.