తానా ఇసి తొలి సమావేశం… పాత నియామకాలు రద్దు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం అందరి పరిచయాలతో ప్రారంభమైంది. 2023-25 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన ఇసి కమిటీ సభ్యుల సమావేశం ప్రెసిడెంట్ నిరంజన్ అధ్యక్షతన శనివారంనాడు జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు తమను తాము పరిచయం చేసుకున్న తరువాత అజెండాపై చర్చను ప్రారంభించారు. ఎన్నికలకు ముందు తానా అడ్హాక్ కమిటీ పేరుతో నియమితులైన ఇసి కమిటీ సభ్యులు తీసుకున్న అన్నీ నియామకాలను రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిసింది. కొత్తగా టీమ్ స్క్వేర్, పాఠశాల వంటి వాటితోపాటు ఇతర నియామకాలను కొత్తగా ఎన్నికైన సభ్యులు చేయనున్నారు. ఈ విషయమై తానా కార్యదర్శి రాజా కసుకుర్తిని సంప్రదించగా ఈ నియామకాల రద్దు విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్నికైన పాలకవర్గ సభ్యులే ఈ నియామకాలను జరపనున్నారని కూడా తెలియజేశారు.







