వచ్చే ఏడాది చివరి వరకూ ఆగాల్సిందే
కరోనా వైరస్ కారణంగా మాంద్యంలోకి వెళ్లిన అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని, అయితే వచ్చే ఏడాది చివరి వరకు అందుకు సమయం పట్టొచ్చని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. చైనా నుంచి అమెరికాకు తమ తయారీ యూనిట్లను బదిలీ చేసే అమెరికా కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడి ఆర్థిక సలహాదారు పేర్కొన్న కొద్ది రోజుల్లోనే పావెల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ప్రజలు తిరిగి ఎవరి పని వారు చేసుకుంటారు. నిరుద్యోగం తగ్గుతుంది. వృద్ధి రాణించడానికి సమయం పట్టొచ్చు. వచ్చే ఏడాది చివరదాకా వేచిచూడాల్సి రావొచ్చు. అయితే ఎప్పటికి అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కరోనా వ్యాప్తి జరగకుండా మనం జాగ్రత్తగా ఉండడం మాత్రమే మన చేతుల్లో ఉందని ఆయన తెలిపారు.






