Buchi Ram Prasad: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చిరాంప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో ఎన్నారైల సేవలను గమనించి వారికి తగిన ప్రాధాన్యతలను ఇస్తూ పలు పదవుల్లో వారిని నియమిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వరించాయి. తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నారై బుచ్చిరాంప్రసాద్ (Buchi Ram Prasad) ను నియమించారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన శ్రీ బుచ్చి రాంప్రసాద్ న్యూయార్క్ రాష్ట్రంలో ఫార్మా రంగంలో బిజినెస్ చేసుకుంటూ అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి కూడా దగ్గరి వ్యక్తి. ఏ విషయమైనా సూటిగా మాట్లాడే శ్రీ బుచ్చిరామ్ ప్రసాద్ తెలుగు దేశం పార్టీ విధి విధానాలు, శ్రీ చంద్రబాబు, శ్రీ లోకేష్ ల నాయకత్వ పటిమకు ఆకర్షితులై, అమెరికా వదిలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియాశీల రాజకీయాలలో గత 10 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు.
గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ నేతగా చాలా ఏళ్లుగా కొనసాగుతున్న రాం ప్రసాద్ టీడిపికి మద్దతుగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ గత వైసిపి ప్రభుత్వంపై విమర్శలను చేస్తూ టిడిపి ప్రభుత్వం రావాల్సిన అవశ్యకతను ఎన్నో సార్లు నొక్కిచెప్పారు. పదేళ్ల పాటు అమెరికాలో ఉండి స్వదేశానికి తిరిగి వచ్చి టీడీపీలో చేరిన రాం ప్రసాద్ కు ఎన్నారైలలో కూడా మంచి పేరు, ఎన్నారైల మద్దతు ఉంది. బ్రాహ్మణ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం రాం ప్రసాద్ ఎన్నో ఏళ్లుగా పాటుపడుతున్నారు. ఆయన శ్రమకు ఈరోజు ఫలితం లభించింది. 10 ఏళ్లు అమెరికాలో ఉండి…ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చేశారు. 2013లో తెదేపాలో చేరారు. 2014 నుంచి 2019 వరకు ఏపీ ఎన్ఆర్టీ చీఫ్ కోఆర్డినేటర్గా వ్యవహరించారు. 2019 నుంచి తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సేవలందించారు. ఎన్ఆర్ఐ తెదేపా పొలిటికల్ కోఆర్డినేటర్గా పని చేశారు. 2022లో బ్రాహ్మణ సాధికారిత కమిటీ రాష్ట్ర కన్వీనర్గా పార్టీ నియమించడంతో బ్రాహ్మణులను సమీకరించి 23 సమావేశాలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో తెదేపా విజయానికి కృషి చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వైకాపా ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించారు. ఆయన సేవలకు గుర్తింపుగా నామినేటెడ్ పోస్టు దక్కింది.
ఈ క్రమంలోనే రాం ప్రసాద్ సేవలకు గుర్తింపుగా సీఎం చంద్రబాబు ఆయనను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ పని తీరుపై , బ్రాహ్మణులకు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల పై గత ప్రభుత్వానికి అనేకసార్లు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆయనకు ఈ పదవి ఇవ్వడం అన్ని విధాల సముచితమని పలువురు పేర్కొన్నారు. ఆయనకు ఈ పదవి లభించడం పట్ల పలువురుఎన్నారైలు, బ్రాహ్మణసంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు టైమ్స్ కూడా ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తోంది.