Atchannaidu: వారిని స్వదేశానికి తీసుకొస్తాం.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : మంత్రి అచ్చెన్న

మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ నావికాదళం అదుపులో ఉన్న మత్స్యకారులను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించామని, అక్కడి ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని తెలిపారు. విజయనగరం (Vijayanagaram) జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని వివరించారు. మత్స్యకార కుటుంబాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి రక్షణ కవచంలా ఉంటుందని తెలిపారు.