చరిత్ర సృష్టించిన పెగ్గీ విట్సన్
రోదసీలో సుదీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగాని పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రల్లో కలిపి అమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 534 రోజుల పాటు గడిపారు. సెప్టెంబర్ వరకూ అక్కడే ఉంటారు. ఈ మేరకు అమె యాత్రను ఇటీవలే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పొడిగించింది. దీంతో ఆమె మరో రికార్డును సృష్టించడానికి మార్గం సుగమమైంది. పెగ్గీ 1980లో నాసాలో చేరారు. పరిశోధకురాలిగా ఆమె అనేక హోదాల్లో పనిచేశారు. 2002లో ఎండీవర్ వ్యోమనౌక ద్వారా ఆమె తొలిసారిగా ఐఎస్ఎస్కు వెళ్లారు. ఐఎస్ఎస్కు నాయకత్వం వహించిన తొలి మహిళగా పెగ్గీ 2008లో చరిత్ర సృష్టించారు. గత నెలలో ఆమె అత్యంత ఎక్కువసేపు (53 గంటలు) స్పేస్ వాక్ల్లో గడిపిన అతివగా మరో రికార్డు స్థాపించారు.






