హెచ్1బీతో మీకూ లాభమే
హెచ్1బి వీసాలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ పెడుతున్న కొర్రీలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్కి ఈ విషయం తెలియజేశారు. కొత్త నిబంధనలు భారత ఐటి కంపెనీలతోపాటు, భారత ఐటి నిపుణుల ఉద్యోగ అవకాశాలనూ దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీసాలపై వచ్చిన భారత ఐటి నిపుణులు అమెరికా ఆర్థిక అభివృద్ధికి చేసిన కీలక సేవలను గుర్తించుకోవాలని జైట్లీ అమెరికా వాణిజ్య మంత్రిని కోరారు. చౌకగా భారత నిపుణులు అందించిన సేవలతో అమెరికా కంపెనీలు తమ పోటీ సామర్థ్యాన్ని పెంచుకుని అంతర్జాతీయ మార్కెట్లోకి పోటీ పడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో హెచ్1బీ వీసాలపై ప్రస్తుతం సమీక్ష మాత్రమే జరుగుతోందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా వాణిజ్య మంత్రి జైట్లీతో చెప్పారు. ఈ వీసాల దుర్వినియోగాన్ని అరికట్టి అత్యున్నత నిపుణులు మాత్రమే ఉపయోగించుకునేలా చేయడమే ట్రంప్ సర్కార్ ఉద్దేశమని తెలిపారు.













