SiliconAndhra ManaBadi: తెలుగుభాషా నిలయం… సిలికానాంధ్ర మనబడి
తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జగమంత తెలుగు కుటుంబం సిలికానాంధ్ర భవిష్యత్ తరాలకోసం తెలుగు భాషను, పిల్లలు ఇష్టపడి నేర్చుకునే విధంగా ఎంతో ఆసక్తికరమైన పాఠాలతో అందమైన పుస్తకాలను తయారుచేసి, ఆడుతూ పాడుతూ తెలుగుభాషను నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నమే సిలికానాంధ్ర మనబడి (SiliconAndhra ManaBadi). తెలుగు భాషను ప్రాచీన భాష నుంచి ప్రపంచభాష చెయ్యాలన్న సంకల్పంతో, ఎందరో భాషాసైనికుల స్వచ్ఛంద సేవా స్ఫూర్తితో 2007 నుండి వేలాది మంది పిల్లలకు తెలుగు నేర్పుతోంది మనబడి. 2007లో 330 మంది పిల్లలతో ప్రారంభమైన మనబడి ఇప్పుడు 2025 లో 12500 పిల్లలకి మన తెలుగు భాషను నేర్పిస్తోంది. ఈ 18 సంవత్సరాలలో మనబడిని అమెరికాలో 35 రాష్ట్రాలలో 220 కేంద్రాలకు, 12 దేశాలకు విస్తరింపజేసింది.
అమెరికా వ్యాప్తంగా వాస్క్ (ACS-Western Association of Schools & Colleges) గుర్తింపు పొందడంతో బాటు, ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్ లలో ప్రపంచ భాషగా (World Language Credit) తెలుగుకి గుర్తింపు తీసుకువచ్చి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో పిల్లలకి పరీక్షలను నిర్వహిస్తోంది మనబడి. అంతే కాదు పిల్లలలోని సృజనాత్మకతకు వేదికగా పిల్లల పండుగ, పద్యనాటకం, నాటకోత్సవం, బాలానందం (రేడియో కార్యక్రమం), తెలుగు మాట్లాట పోటీలు, తెలుగుకుపరుగు, పలుకుబడి వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలకి ఒక చక్కని తెలుగు వాతావరణాన్ని కలిగిస్తూ తెలుగు భాషపై ఇష్టాన్ని, ప్రేమని పెంపొందిస్తూ నేటి ప్రవాస బాలలను భావి ప్రపంచ తెలుగు పౌరులుగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది సిలికానాంధ్ర మనబడి.
https://manabadi.siliconandhra.org
పిల్లలలోని సృజనాత్మకతకు వేదికగా మనబడి నిర్వహిస్తున్న మరెన్నో విలువైన కార్యక్రమాలు:
బాలానందం రేడియో: మనబడి విద్యార్ధులు-ఉపాధ్యాయులు(అత్తయ్య-మామయ్య)లతో కలిసి చేసే రేడియో కార్యక్రమం ప్రతి శనివారం, ఆదివారం ‘‘తెలుగు వన్’’ మరియు ‘‘తెలుగు ఎన్నారై రేడియోలలో.
బాలరంజని(మొబైల్ యాప్): మనబడి విద్యార్ధులు పాఠాలను ఆటపాటలతో వినోదాత్మకంగా నేర్చుకోవడానికి తీర్చిదిద్దిన మొబైల్ యాప్.
a తెలుగు మాట్లాటం: పదరంగం, తిరకాటం, ఒనిమా వంటి ఆటలతో బుడుతలు, చిరుతలకు తెలుగు భాష పోటీలు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి బహుమతులు.
తెలుగుకు పరుగు: తెలుగు జెండాను ఎగురవేస్తు, ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తెలుగు కోసం 5కె రన్, 10కే రన్, హాఫ్ మారథాన్ పరుగెడదాం.
పద్యనాటకం: తెలుగు వారికే సొంతమైన పద్యనాటకం-రాగం, రంగస్థలం, రంగాలంకరణం, పూర్తి అలంకారాలతో మనబడి విద్యార్ధులతో విశ్వవేదికపై ప్రదర్శనలు.
పలుకుబడి: తెలుగు భాష పలకడం (మాట్లాడడం)లో మెళకువలు నేర్పేందుకు ప్రత్యేక శిక్షణ కోసమే పలుకుబడి
పిల్లల పండుగ: తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి గాంచిన కళారూపాలలో మనబడి విద్యార్ధులకు శిక్షణ – ప్రదర్శనలు.
మనతరం: నిన్నటి విద్యార్ధులే నేటి బాల గురువులు. వారిని రేపటి తరానికి తెలుగు భాషా సార్థులుగా తీర్చిదిద్దే ఒరవడి.
తెలుగు భాషకు వేల సంవత్సరాల గత వైభవం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో వేలయేళ్ళ భవిష్యత్తు కోసం, భాషాసేవయే భావితరాల సేవ అనే నినాదంతో, 18 సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగుతోంది సిలికానాంధ్ర మనబడి.







