అమెరికా కుంగిపోతోందా..?
అవకాశాల స్వర్గం.. అగ్రరాజ్యం.. అమెరికాను ఓవిషయం వణికిస్తోంది. అమెరికాలోని అతి పెద్దనగరాలు భూమిలోకి కుంగిపోతున్నాయి. ఓవైపు న్యూయార్క్, మరోవైపు షికాగో నగరాలు.. భూమిపొరల్లోకి దిగిపోతున్నాయి. దీంతో ఆనగరాలను ఎలా కాపాడుకోవాలా అన్న అంశంపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. దీనికోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది.అయితే అవి ఎంతవరకూ సఫలీకృతం అవుతాయన్నఅంశంపై క్లారిటీ లేదు. పరిశోధకులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అమెరికాలోని మూడో అతిపెద్ద నగరం షికాగో భూమిలోకి కుంగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘సబ్‌సర్ఫేస్ హీట్ ఐలాండ్స్’గా పిలిచే భూగర్భ పర్యావరణ మార్పులే అందుకు కారణమంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమిలో మార్పులకు కారణమవుతున్నాయని, భవనాలు, మౌలిక సదుపాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతూ దీర్ఘకాల మన్నికకు ముప్పుగా పరిణమిస్తున్నట్టు గుర్తించారు. నగరాలు జమసమ్మర్థంతో కిక్కిరిసిపోవడం వల్ల భూగర్భ పర్యావరణం మార్పులకు గురయ్యే అవకాశం ఉందని… అధ్యయనానికి నేతృత్వం వహించిన నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
వాతావరణ హెచ్చుతగ్గుదల వల్ల మట్టి, రాళ్లు, ఇతర నిర్మాణ పదార్థాలు ప్రభావానికి గురవుతున్నట్టు వీరి పరిశోధనల్లో వెల్లడైంది. భూమిపై కంటే భూగర్భంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీలు అధికంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. జనాభా పరంగా అతిపెద్ద నగరమైన న్యూయార్క్ నగరం కూడా భూమిలోకి కుంగుతున్నట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. 1.68 ట్రిలియన్ టన్నుల మహానగరంలో కొంత భాగం భూమి కుంగి ఉండొచ్చని చెబుతున్నారు.
న్యూ యార్క్ సిటీ డేంజర్ జోన్లో ఉంది. ఏ క్షణం పేకమేడలా కుప్పకూలుతుందో చెప్పలేని పొజిషన్.. పర్యావరణ మార్పు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, నగరంలోని ఆకాశ హర్మ్యాల బరువు.. ఈ మూడూ న్యూ యార్క్‌పై హెవీ టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే ఏటా 2 మిల్లీమీటర్ల మేర ఈ మహానగరం కుంగుతోంది. 2100 నాటికి 500 మిల్లీమీటర్ల నుంచి 1500 మిల్లీమీటర్ల మేర కుంగుబాటు ఉంటుందని అంచనా. సైంటిస్టులు చెబుతున్నట్లు.. న్యూ యార్క్ కూలిపోతుందా.. అదే జరిగితే పరిస్థితేంటి.. అసలు న్యూ యార్క్‌కు ఈ దారుణ స్థితి ఎందుకొచ్చింది? అంటే చాలా కారణాలే కనిపిస్తున్నాయి.
తాజాగా పరిశోధనల ప్రకారం.. న్యూయార్క్ ఏటా 1-2 మిల్లీ మీటర్ల వేగంతో కుంగుతుంది. మాన్హాటన్, బ్రూక్లిన్, క్వీన్స్ నాలుగు చతురస్రాకార గ్రిడ్లు ఎక్కువగా ప్రభావితం అవుతుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల పది లక్షల భవనాలు, లక్షల మందికి ముంపు ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. ఈ కారణంగానే ఏటా న్యూయార్క్‌కు వరదల పోటు వస్తుందంటున్నారు. అయితే, న్యూ యార్క్‌ను కాపాడేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి ప్రభుత్వాలు.
పది లక్షల కంటే ఎక్కువ భవనాలు ఉండటంతో.. న్యూయార్క్ సిటీలో భూమిపై భారం అధికంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏ క్షణం చేతులెత్తేసినా చాప్టర్ క్లోజ్ అని హెచ్చరిస్తున్నారు. భూగర్బ జలాలు వెలికితీత, పెరుగుతున్న పట్టణీకరణ, రోడ్లు, వంతెనలు, రైల్వేలు సహా అనేక కారణాలు ఈ భూమి కుంగిపోవడానికి కారణాలని వివరిస్తున్నారు.. ప్రభుత్వం మేల్కోకపోతే న్యూయార్క్ నగరం చరిత్రలో మిగిలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






