సమానత్వం సాధనకు ఆయన అడుగుజాడల్లో నడవాలి
మహిళలు, అప్పసంఖ్యాక వర్గాలు, అణగారినవర్గాల హక్కుల కోసం భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కృషి చేశారని ఐక్యారాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ శ్లాఘించారు. సామాజిక న్యాయం, సమానత్వం సాధనకు ఆయన అడుగుజాడల్లో నడవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఈ దిశగా చేసే ప్రయత్నాల్లో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అంబేడ్కర్ 126వ జయంతి సందర్భంగా ఐరాసలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని, సమ్మిళిత సమాజాన్ని సాధించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం అనే అంశంపై ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం అమెరికాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి భారత శాశ్వత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా పొందేందుకు డిజిటల్ గుర్తింపు విధానం దోహదం చేస్తుందని అమీనా మొహమ్మద్ చెప్పారు.ఆధార్ కార్డులు ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.






