హోరెత్తిన ఏఐఏ మ్యాంగో ఫెస్టివల్.. ప్రత్యేక ఆకర్షణగా జయరామ్ కోమటి సన్మాన వేడుక!
AIA: అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ & షాపింగ్ ఫెస్ట్ (TGIFS)’ , ‘మ్యాంగో ఫెస్టివల్’ శనివారం శాన్ రామన్‌లోని బిషప్ రాంచ్లో అత్యంత వైభవంగా జరిగాయి. బే ఏరియా నలుమూలల నుండి సుమారు 15,000 మందికి పైగా సందర్శకులు తరలివచ్చి ఈ సాంస్కృతిక, ఆహార , వినోద వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకను సంజీవ్ గుప్త CPA గ్రాండ్ స్పాన్సర్‌గా, రియల్టర్ లావణ్య దువ్వి ప్లాటినం స్పాన్సర్‌గా వ్యవహరించగా, ట్రావెలపోడ్ ట్రావెల్ పార్ట్నర్గా, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య సహకారంతో నిర్వహించారు.

నోరూరించిన మామిడి పండ్ల పండుగ..
ఈ ఏడాది ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మ్యాంగో ఫెస్టివల్ (Mango Festival). సీజనల్ మామిడి పండ్లతో తయారు చేసిన వివిధ రకాల డెజర్ట్‌లు, పానీయాలు, స్వీట్లు సందర్శకులను కట్టిపడేశాయి. మామిడి రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వీటితో పాటు 100కు పైగా స్టాళ్లలో భారతీయ , ప్రపంచ స్థాయి వంటకాలు, దుస్తులు, జ్యువెలరీ, హస్తకళలు , గృహాలంకరణ వస్తువుల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.
జయరామ్ కోమటికి ఘన సన్మానం..
ఈ వేడుకలో ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన శ్రీ జయరామ్ కోమటిని ఏఐఏ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు దక్కిన ఈ గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, అమెరికా , ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్ నహాస్ అలీ, అలమెడ కౌంటీ సూపర్వైజర్ ఎలిసా మార్క్వెజ్, శాన్ రామన్ వైస్ మేయర్ మారిసోల్ రూబియో తదితర ప్రముఖులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

సందడిగా వినోద కార్యక్రమాలు..
వ్యాపార, వాణిజ్య స్టాళ్లతో పాటు నాన్‌స్టాప్ లైవ్ ఎంటర్టైన్మెంట్ ఈ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక నృత్య బృందాల ప్రదర్శనలు, కచేరీలు, డీజే హంగామా , సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. ముఖ్యంగా మదర్స్ డే సందర్భంగా నిర్వహించిన ‘చీరల ప్రదర్శన’ (Saree Promenade) విశేష స్పందన పొందింది. చిన్నారుల కోసం కార్నివాల్ రైడ్స్, గేమ్స్ వంటి వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బే ఏరియాలో వైవిధ్యాన్ని చాటుతూ ఏటా నిర్వహించే ఈ ఫెస్టివల్ స్థానిక వ్యాపారవేత్తలకు మంచి వేదికగా నిలుస్తోందని ఏఐఏ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.






