19వ ఆటా మహాసభల కార్యక్రమాలు
షార్ట్ ఫిల్మ్, రీల్స్, ‘సయ్యంది పాదం’, అందాల పోటీల నిర్వహణ
అమెరికాలోని ప్రతిష్టాత్మక తెలుగు సంస్థ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్ వేదికగా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోంది. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ఆటా మహాసభలు, యూత్ కన్వెన్షన్ యువతలోని ప్రతిభను వెలికితీయడానికి సరికొత్త వేదికను సిద్ధం చేసింది. ఈ వేడుకల్లో భాగంగా షార్ట్ ఫిల్మ్ , రీల్స్, ఫోటోగ్రఫీ విభాగాల్లో భారీ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు ప్రకటించారు.
టాలీవుడ్ దిగ్గజాల సమక్షంలో అవార్డుల ప్రదానం:
తమలోని కళాత్మక ఆలోచనలకు దృశ్య రూపం ఇచ్చే వర్ధమాన కళాకారులకు ఇదొక సువర్ణావకాశం. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి టాలీవుడ్ ప్రముఖ సినీ సెలబ్రిటీల చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు. వెండితెర దిగ్గజాల సమక్షంలో ప్రతిభను చాటుకోవడమే కాకుండా, వారి నుండే ప్రశంసలు పొందే వీలుండటంతో క్రియేటివ్ మైండ్స్ ఈ పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఈ సృజనాత్మక పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 10, 2026.
రిజిస్ట్రేషన్ ఫీజు: 25 డాలర్లు
బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌పై నిర్మాతల పర్యవేక్షణలో ఏర్పాట్లు:
ఈ పోటీల నిర్వహణ బాధ్యతలను చైర్‌గా కృష్ణ మోహన్ ములే, కో-చైర్‌గా మహీ సనపరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు రాజ్ కందుకూరి, ఆర్వీ రెడ్డి, శివ మేక సలహాదారులుగా వ్యవహరిస్తూ తమ అనుభవంతో ఈ పోటీలను క్షేత్రస్థాయిలో నడిపిస్తున్నారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా నేతృత్వంలోని కోర్ కమిటీ బృందం ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతోంది.. సరికొత్త ఆలోచనలతో యువత వెంటనే రిజిస్టర్ చేసుకుని, ఈ అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటాలని ఆటా బృందం కోరుతోంది.
బాల్టిమోర్ వేదికగా ‘ఆటా’ అందాల పోటీలు..
అమెరికాలోని తెలుగు లోగిళ్లలో అందాల సందడి మొదలుకానుంది. ప్రతిష్టాత్మక అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న 19వ మహాసభల్లో భాగంగా ‘ఆటా పేజెంట్ 2026’ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ మహాసభలు, మన తెలుగు అందాలకు, ప్రతిభకు అంతర్జాతీయ వేదికను అందించనున్నాయి. అట్లాంటా, ఆస్టిన్, చికాగో, డల్లాస్, డెట్రాయిట్, ణ్పు/వీణ/VA, లాస్ ఏంజిల్స్, నాష్విల్లే, న్యూజెర్సీ, ఓర్లాండో, ఫినిక్స్, ఫిలడెల్ఫియా, రాలీ వంటి నగరాల నుంచి అభ్యర్థులు పాల్గొనే ఈ పోటీలను మొత్తం ఐదు విభిన్న విభాగాల్లో నిర్వహిస్తున్నారు.
13 నుండి 16 ఏళ్ల వయస్సు ఉన్నవారికోసం మిస్ టీన్ ఆటా పోటీలను, 17 ఏళ్లు పైబడిన యువతుల కోసం మిస్ ఆటా పోటీలు, 13 నుంచి 17 ఏళ్ళ పై బడిన యువకులకోసం మిస్టర్ ఆటా, 21 ఏళ్లు పైబడిన వివాహిత మహిళల కోసం మిసెస్ ఆటా పేరుతో పోటీలను ఏర్పాటు చేశారు. ఈ అందాల పోటీల్లో తలపడాలనుకునే ఆటా సభ్యులు వి30, సభ్యులు కాని వారు వి50 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15 చివరి తేదీ అని తెలిపారు. విజేతలకు ప్రతిష్టాత్మకమైన ‘ఆటా టైటిల’తో పాటు, సినీ ప్రముఖుల సమక్షంలో అవార్డులను అందజేస్తారు.
ఈ వేడుకను చైర్ పర్సన్ ప్రత్యూష నరపరాజు నేతృత్వంలో కో-చైర్లు మీనల్ మణికంఠన్, కావ్య, భార్గవి , అడ్వైజర్లు నీహారిక నవల్గ, స్రవంతి రాచకుళ్ల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా ఆధ్వర్యంలోని కోర్ కమిటీ బృందం ఈ మెగా ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆసక్తి గల వారు వెంటనే ఆటా అధికారిక వెబ్సైట్ సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహక బృందం కోరుతోంది.
ఆటా మహాసభల్లో కళాకారులకు ఆహ్వానం
బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్న 19వ ‘ఆటా’ మహాసభలు, యూత్ కన్వెన్షన్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మెగా ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కళాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఆటా సాంస్కృతిక కమిటీ ఆహ్వానం పలుకుతోంది. ‘కళాకారులకు వేదిక — కళాభిమానులకు వేడుక” అనే నినాదంతో ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలను వినూత్నంగా రూపొందిస్తున్నారు. సంగీతం, క్లాసికల్, మోడరన్ నృత్యాలు, జానపద కళలు వంటి వివిధ విభాగాల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి ఇదొక గొప్ప అవకాశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ మహాసభల్లో పాల్గొనాలనుకునే కళాకారులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 30, 2026 వరకు సమయం ఉంది. ఆసక్తి గల వారు సంస్థ అధికారిక వెబ్సైట్ https://ataconference.org ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవవచ్చు.
మహాసభల విజయవంతం కోసం ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా నేతృత్వంలోని కోర్ కమిటీ బృందం నిరంతరం శ్రమిస్తోంది. వేలాదిగా తరలిరానున్న తెలుగు ప్రజల మధ్య తమ ప్రతిభను ప్రదర్శించే ఈ సువర్ణావకాశాన్ని కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆటా బృందం విజ్ఞప్తి చేసింది.
ఏప్రిల్ 18న న్యూజెర్సీలో ఆటా క్లీన్ అప్ డ్రైవ్
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ న్యూజెర్సీ విభాగం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వార్షిక ‘ఎర్త్ డే’ పురస్కరించుకుని సౌత్ బ్రన్ విక్ టౌన్షిప్లో ‘లీటర్ క్లీన్ అప’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు ప్రకటించారు. ఏప్రిల్ 18, ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి 11:00 గంటల వరకు న్యూజెర్సీలోని డీటన్ ప్రాంతంలో ఈ పరిశుభ్రత కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆటా చీజీ యూత్ టీమ్ సభ్యులు ఇషితారెడ్డి ములే, అక్షిత్ ఆకుల, రిషిత జంబుల, దీక్షా కట్టా, ఇషానిరెడ్డి కోరం, షణ్ముఖప్రియ, అయాన్ రెడ్డి తుమ్మల ప్రత్యేకంగా పాల్గొని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమ విజయవంతం కోసం రీజినల్ కోఆర్డినేటర్లు కృష్ణ మోహన్ ములే, ప్రదీప్ కట్టా, ప్రసాద్ ఆకుల, రీజినల్ ఉమెన్స్ చైర్ గీతా రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జయంత్ చల్లా (ప్రెసిడెంట్), సతీష్ రామసహాయం రెడ్డి (ప్రెసిడెంట్ ఎలక్ట్) తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నారు. బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభల లోపు ఇటువంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేసారు. ఈ క్లీన్ అప్ డ్రైవ్‌లో స్థానిక తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహక బృందం కోరుకుంటుంది.






