Vishnu Vinyasam: జాతకాల పిచ్చితో శ్రీ ‘విష్ణు విన్యాసం’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
తారాగణం : శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్,
సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ
సంగీతం: రధన్, పాటలు : రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం
సమర్పణ: హేమ & షాలిని, నిర్మాత: సుమంత్ నాయుడు జి
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
విడుదల తేది: 27.02.2026
నిడివి : 2 ఘంటల 07 నిముషాలు
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు (Sri Vishnu) హిలేరియస్ జాయ్‌రైడ్ ‘విష్ణు విన్యాసం‘తో (Vishnu Vinyasam) ప్రతి అప్డేట్తో బజ్ పెంచుతున్నాడు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన సారిక(Nayan Sarika) హీరోయిన్ గా నటిస్తోంది. ఆడియన్స్‌ని థియేటర్స్ నుంచి నవ్వించి పంపించడం మాత్రం గ్యారంటీ అనే నమ్మకాన్ని గత చిత్రాలతో కలిగించారు శ్రీ విష్ణు. అయితే ఈసారి ‘విష్ణు విన్యాసం’ అంటూ తన ‘జాతకం’ తేల్చుకోవడానికి వచ్చాడు శ్రీవిష్ణు. మరి శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’లో తేలిన జాతకం ఎలావుందో సమీక్షలో చూద్దాం.
కథ :
జాతకాల పిచ్చి ఉన్నోడుకి జాతక గండం ఉన్న అమ్మాయి భార్యగా వస్తే అతని ‘జాతకం’ ఏవిధంగా తలకిందులైంది? అన్నదే ‘విష్ణు విన్యాసం’ సినిమా. ఒంగోలులో జూనియర్ లెక్చరర్‌గా పనిచేసే విష్ణు (శ్రీవిష్ణు)కి జాతకాలంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే.. తన ఇంటి బాత్ రూంకి వాస్తు బాలేదని పక్కింటి బాత్ రూంకి నెలనెలా అద్దె కట్టి పోయేటంత పిచ్చి. అందమైన అమ్మాయి ఎదురొచ్చి ముద్దడిగితే.. పంతులకు ఫోన్ చేసి పెట్టమంటారా.. గ్రహాలు అనుకూలిస్తాయా?
ఇవి కూడా చదవండి
అనేంత జాతకాల పిచ్చ. అదే కాలేజీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (HOD)గా పనిచేసే మనీషా (నయన్ సారిక) ప్రేమలో పడతాడు. ఆమె కూడా రావడంతోనే ఈ జాతకాల పిచ్చోడ్ని లవ్‌లో పడేస్తుంది. మనీషా క్యారెక్టర్ కొంచెం వింతగా, వెరైటీగా ఉంటుంది. అంతా బాగుంది, పెళ్లి చేసుకుందాం అనుకునే టైమ్‌లో మనీషా తన జాతక దోషం గురించి చెబుతుంది. అసలు ఆ గండం ఏంటి? దాన్నుంచి విష్ణు ఎలా బయటపడ్డాడు. ఆ దోషం వల్ల ఆమె పెళ్లికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? విష్ణు ఆ దోషం గురించి విని ఎందుకు వెనకడుగు వేశాడు? చివరికి వీరిద్దరూ ఎలా కలిశారు? వీరి ‘విష్ణు విన్యాసం’ ఏవిధంగా సాగింది అన్నదే మిగిలిన కథ.
నటీనటుల హావభావాలు:
గతం లో జాతకాల పిచ్చి వున్న కథానాయకుడిగా రాజేంద్ర ప్రసాద్ తన కేరేర్ లోనే ఓ టర్నింగ్ పాయింట్ చిత్రాలు లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడక్కు. ఆ తరువాత వెంకి చిత్రం లో రవితేజ అధ్బుతంగా నటించారు. అలా ముడనమ్మకాలకు అమ్మ మొగుడు లాంటి పాత్రలో ఒదిగిపోయాడు శ్రీవిష్ణు. అతని కామెడీ టైమింగ్‌కి వంకపెట్టలేం. సినిమా మొత్తం శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌తో ఫన్ పటాకాలు పేల్చాడు. విష్ణు విన్యాసంలో చాలానే విచిత్ర విన్యాసాలు చూపించాడు శ్రీవిష్ణు. కథలో కొత్తదనం లేకపోయినా కూడా ఉన్నంతలో నవ్వించారు. ఈ కథలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉందో.. హీరోయిన్ నయన్ సారికకి అంతే ప్రాధాన్యత ఉంది. ఆయ్, క చిత్రాలతో నటిగా మంచి మార్కులు అందుకున్న నయన్ సారిక ‘విష్ణు విన్యాసం’లోనూ మెప్పించింది. తన పక్కన ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ ఉన్నా కూడా అతనితో పోటీ పడి నటించింది. ఇద్దరి జోడీతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ కూడా బావుంది. అయితే హీరోయిన్ సిగరెట్ తాగడం.. మందు కొట్టడం.. మీదపడిపోయి ముద్దులు అడగడం.. లాంటి సీన్లు అవసరమా? అనేట్టుగా ఉంటాయి కానీ.. ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తరువాత హో ఇందుకా ఈ సెటప్ అంతా అనేట్టుగా కన్వెన్స్ చేశారు. మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని.. ఇలా డజన్ల కొద్దీ ఆర్టిస్ల్లు ఉన్నారు. హీరో ఫ్రెండ్‌గా సత్య బాగానే నవ్వించాడు. జ్యోతిష్యుడిగా మురళీ శర్మ కథలో ముఖ్య భాగం అయ్యారు.
సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు యదునాథ్ మారుతీ రావు(Yadunath Maruthi Rao) హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ను చాలా కొత్తగా రాసుకున్నాడు, దాని చుట్టూ బలమైన కథనాన్ని అల్లడంలో సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. శ్రీవిష్ణు, సత్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. సెకండ్ హాఫ్ మొదలైన కొద్దిసేపటికే సినిమా కాస్త పాత వాసనలు వస్తుంది. కొన్ని సీన్లు రిపీటెడ్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ ముందు వచ్చే ముప్పై నిమిషాల డ్రామా కూడా బాగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. కాకపోతే కొంత మంది ఊహించేలా ఉంటుంది.సినిమా నిడివి రెండు గంటలే కావడంతో పెద్ద బోరింగ్‌గా ఏం అనిపించదు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ.. కలర్ ఫుల్, రిచ్‌గా అనిపిస్తాయి. రధన్ అందించిన సాంగ్స్ కథకి హెల్ప్ అయ్యాయి. సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ‘అల్లుడు అదుర్స్’ ‘హరోం హర’ వంటి సినిమాలను నిర్మించి నష్టపోయిన ‘సుమంత్ నాయుడు జి’ విష్ణు విన్యాసంతో ఆ నష్టాలను పూడ్చుకుంటానని చెప్పారు. మరి చూడాలి?
విశ్లేషణ :
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘విష్ణు విన్యాసం’లో శ్రీవిష్ణు తన కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనే ట్యాగ్ కి తగ్గట్టే సాలిడ్ పెర్ఫార్మన్స్ తో ఎంటర్టైన్ చేస్తాడు. అలాగే ఇందులో దాదాపు కామెడీ సీన్స్ అన్ని వర్కవుట్ అయ్యాయి. అలానే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా కొంచెం పికప్ అయ్యింది. కాకపోతే కొంచెం సాగదీతగా అనిపించే సెకండాఫ్, రొటీన్ కాన్సెప్ట్, కథనాలు ఇందులో బలహీనంగా అనిపించాయి. వీటిని పక్కన పెట్టి కేవలం ఎంటర్టైనర్ మాత్రం కావాలి అనుకుంటే ఇది ఓకే అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి






