‘Dhurandhar-The Revenge’ Review: ‘ధురంధర్ ది రివెంజ్’మరో సారి మట్టుబెట్టాడు!
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్థలు : జియో స్టూడియోస్, బి 62 స్టూడియోస్,
తారాగణం: రణ్వీర్ సింగ్, మాధవన్, సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్,
రాకేశ్ బేడి, గౌరవ్ గేర, ధనిష్ పండోర్ తదితరులు నటించారు.
సంగీతం: శాశ్వట్ సచ్డేవ్, సినిమాటోగ్రఫీ: వికాష్ నౌలాఖ
కూర్పు: శివ్ కుమార్ వి.పానికెర్,
కథా సహకారం: ఓజస్ గౌతం, శివ్ కుమార్ వి.పానికెర్
నిర్మాతలు: ఆదిత్య ధార్, జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధార్
రచన, దర్శకత్వం: ఆదిత్య ధార్
విడుదల తేది :19.03.2026
నిడివి : 3 ఘంటల 49 నిముషాలు
రణ్వీర్ సింగ్ (Ranveer Singh)హీరోగా ఆదిత్య ధార్(Aditya Dhaar) తెరకెక్కించిన ధురంధర్ గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన బీభత్సం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓ బాలీవుడ్ సినిమా గురించి చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులు మాట్లాడుకొని చాన్నాళ్లే అయిపోయింది. అలాంటి సమయంలో ధురంధర్ అటు ఉత్తరాదితో పాటు ఇటు దక్షిణాది ప్రేక్షుకుల్ని కూడా ఆకట్టుకుంది. ఇక ధురంధర్కి సీక్వెల్‌గా ‘ధురంధర్ ది రెవెంజ్’ తెరకెక్కింది. మొదటి పార్ట్‌ని మించిన యాక్షన్ సీన్లు, కథ, కథనం, రక్తపాతం అన్నీ ఇందులో ఉంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. అందులోనూ హిందీతో పాటు పాన్ ఇండియా లెవల్లో దక్షిణాది భాషలన్నింటిలోనూ చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే ప్రీమియర్ షో బుకింగ్స్‌కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ధురంధర్ 2 ఎలా ఉంది..? ఆడియన్స్‌కి మొదటి పార్ట్ ఇచ్చినంత కిక్కు ఇచ్చిందో లేదో సమీక్షలో చూద్దాం.
కథ:
భారత్‌పై ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్థాన్ చేస్తున్న మారణహోమాన్ని అంతం చేయాలంటే ఆపరేషన్ ధురంధర్ చేపట్టాల్సిందేనని భారత ఇంటెలిజెన్స్ బ్యూరీ చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తారు. ఈ ఆపరేషన్‌కి పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడ్ని భారత ఏజెంట్‌గా హమ్జా (రణ్వీర్ సింగ్) అనే మారుపేరుతో పాకిస్థాన్‌కి పంపిస్తారు. అక్కడికి ఒక సామ్యానుడిగా అడుగుపెట్టి పాకిస్థాన్‌లో ఓ స్థాయికి ఎలా ఎదిగాడు..? ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడనేది ధురంధర్ మొదటి పార్ట్ కథ. రెహమాన్ డెకాయిత్ (అక్షయ్ ఖన్నా) మరణంతో మొదటి పార్ట్‌ని ముగించారు.
ఇవి కూడా చదవండి
ఇక ‘ధురంధర్ ది రివెంజ్’ కథా విషయానికొస్తే…పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలోని లైయారీ పట్టణంలో ఇండియన్ ఏజెంట్‌గా పనిచేసే హమ్జా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్ రాంగీ (రణ్వీర్ సింగ్). కరాచీ, లాహోర్ రాజకీయాల్లోకి అండర్ డాగ్‌గా చేరి అక్కడి నేతలను శాసించే స్థాయికి చేరుకొంటాడు. ఇక రెహ్మత్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా)ను హతమార్చిన తర్వాత అతడి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొంటాడు. కరాచీ కేంద్రంగా భారత్‌ను విచ్చిన్నం చేసే కుట్రలకు చెక్ పెట్టేందుకు సిద్దమవుతాడు. భారత్‌లోకి అక్రమంగా చొరబాటు చేసే లష్కరే తోయిబా, మొజాహిద్దీన్ తీవ్రవాదులను, అలాగే ఫేక్ కరెన్సీ సరఫరా, అక్రమ ఆయుధాలను చేరే వేసే వారికి సహకారం అందించే భారత్‌లోని స్థానిక నేతలను మట్టుబెట్టే కార్యక్రమాన్ని చేపడుతారు.
ఈ క్రమంలో కరాచీలో అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ వ్యాపారం చేయడానికి వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడు.. జస్కిరాత్ సింగ్‌ను గుర్తిస్తాడు. హమ్జా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్ రాంగీ గతం ఏమిటి? జస్కిరాత్ సింగ్ రాంగీ ఎందుకు హమ్జా ఆలీ మజారీగా మారాడు. సైన్యంలో పనిచేయాలని కోరికతో ఉండే జస్కిరాత్ సింగ్ హత్య కేసులో దోషిగా ఎందుకు మారాడు? దాదాపు 12 హత్యలు ఎందుకు చేశాడు? హత్య కేసులో దోషిగా ఉన్న జస్కిరాత్ను హమ్జాగా ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ ఎందుకు మార్చాడు? ఇండియన్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడు? భారత్‌లో నోట్ల రద్దు వెనుక జస్కిరాత్ సింగ్ పాత్ర ఏమిటి? కరాచీలో తలదాచుకొన్న దావూద్ ఇబ్రహీంను ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ ఎలా శిక్షించారు? కరాచీలో స్పెషల్ మిషన్ మీద వెళ్లిన జస్కిరాత్ సింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత ఏం జరిగింది? తనకు అప్పగించిన మిషన్‌ను హమ్జాగా జస్కిరాత్ సింగ్ ఎలా పూర్తి చేశాడు? హమ్జా భారత ఏజెంట్ అని ఎవరైనా తెలుసుకున్నారా? ఎస్పీ చౌదరీ అస్లాం (సంజయ్ దత్) పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? అలానే హమ్జాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎలీనా (సారా అర్జున్) రెండవ బాగంలో ఆమె ప్రాముఖ్యత ఏ విదంగా ఉంటుంది? మొత్తానికి ధురంధర్ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
నటీనటుల హావబావలు:
ధురంధర్ సినిమాలో రణ్వీర్ యాక్టింగ్ ఏ రేంజులో ఉంటుందో అక్షయ్ ఖన్నాకి కూడా అదే రేంజులో ప్రశంసలు వచ్చాయి. అయితే ధురంధర్ 2లో మాత్రం రణ్వీర్ ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అసలు సినిమా మొదలైనప్పటి నుంచి చివరి నిమిషం వరకూ అసలు ఆ పాత్రకి రణ్వీర్ తప్ప వేరెవరూ న్యాయం చేయలేరేమో అన్నట్లుగా ఆడియన్స్‌ని కట్టిపడేశాడు. ఫ్యామిలీ కోసం అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడిన కుర్రాడిగా, దేశం కోసం ఏజెంట్‌గా మారి ప్రాణాల్నే లెక్కచేయని వ్యక్తిగా, కింగ్ ఆఫ్ ల్యారీగా మొదలై.. కరాచీ కా బాద్షా, బలోచీ కా షేర్ అని ఎత్తు ఎదుగుతున్న ప్రతిసారి ఆయా స్థాయిల్లో రణ్వీర్ కనిపించిన తీరు బెస్ట్ లెవెల్లో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఎంత క్రూరంగా కనిపించాడో ఎమోషనల్ సీన్లలో అంతలా కంటతడి కూడా పెట్టించే నటన కనబరిచాడు రణ్వీర్. ఇప్పటివరకూ రణ్వీర్ కెరీర్లో చేసిన పాత్రలు ఎంత పేరు తెచ్చాయో? ధురంధర్లో పోషించిన హమ్జా పాత్ర అంతకంటే ఎక్కువ పేరు తెస్తుంది. ఇక అజయ్ సన్యాల్‌గా మాధవన్ నటన కూడా చాలా బావుంది. చాలా కూల్‌గా కనిపిస్తూ దేశం కోసం ఎత్తులు వేసే ఇంటెలిజెన్స్ చీఫ్ పాత్రలో మాధవన్ నటన శభాష్ అనిపిస్తుంది. ఇక సంజయ్ దత్ మరోసారి తన నటనతో అదరగొట్టారు. అర్జున్ రాంపాల్ పాత్ర కూడా చాలా దీటుగా కనిపిస్తుంది. ఇక సారా అర్జున్ పాత్రకి స్కోప్ తక్కువే అయినా కూడా ఉన్న సీన్లలో మెప్పించింది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు కూడా అందరూ మంచిగా యాక్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
సాంకేతిక వర్గం పనితీరు:
ముఖ్యంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అయిన నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, పాకిస్థాన్‌లో ఉగ్రవాదంపై తీసుకున్న చర్యలు ఇలాంటివాటిని చాలా బలంగా, క్లియర్‌గా చూపిస్తూ వాటిని స్టోరీకి లింక్ చేయడంలో కూడా ఆదిత్య ధార్ తన పనితనం చూపించాడు. మొదటి 30 నిమిషాల్లోనే బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన వాతావారణాన్ని సన్నివేశాల రూపంలో దర్శకుడు సెట్ చేసిన విధానం ఎక్సలెంట్ ఉంటుంది. అలా కథకు కనెక్ట్ చేసి నేరుగా సినిమాలోకి తీసుకెళ్తాడు. తొలి గంటలో గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన తర్వాత కథలో వేగం కొంత మందగించినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలను సాగదీసినట్టు చెప్పడంతో స్టోరీ మీద పట్టు జారిపోతుందా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లి సెకండాఫ్‌పై ఆసక్తిని రేపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథను మొదలుపెట్టి కేక పుట్టించాడు.
దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, అలాగే భారత్‌లోకి నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలు, ప్రధాని మోదీ నోట్ల రద్దు వ్యవహారం కథలో కీలకంగానే కాకుండా సినిమాను బ్లాక్ బస్టర్ మూవీగా మార్చేందుకు దోహదపడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో క్రిమినల్స్ పాత్రను చాలా విపులంగా చూపించారు. అలాగే ఐఎస్ఐ, లష్కరే ట్రైనింగ్ స్థావరాలను ధ్వంసం చేయడం లాంటి అంశాలు సినిమాలో ఎమోషన్స్, దేశభక్తిని పెంచేలా చేశాయి. ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా సాగడంతో సుమారు నాలుగు గంటలపాటు సాగే సినిమాలో ఒక్క సీన్ కూడా బోర్ అనిపించకుండా దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు హ్యాట్సాప్ అని చెప్పాలి. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది. నాలుగు గంటల సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా ఎడిటర్ తన పనితనాన్ని చూపించిన విధానం ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భారీగా హైప్ చేసింది. సినిమాటోగ్రఫి బాగుంది. వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయి. కానీ సన్నివేశాలను డీ గ్రేడ్ చేసే విధంగా లేకపోవడం పాజిటివ్ అంశం. నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
విశ్లేషణ:
ధురంధర్ సినిమా ఇప్పటికే కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా వచ్చిన ‘ధురంధర్ ది రివెంజ్’ అన్ని రకాల అంచనాలను అధిగమిస్తూ కథ, కథనాలు బాగా ఉన్నాయి. బలమైన డైలాగ్స్, సీన్లు ఈ సినిమాను సూపర్ హిట్ సినిమాగా మార్చబోతున్నాయని చెప్పవచ్చు. సినిమాలో వయెలెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా మొత్తం చాలా సీన్లు రక్తపాతంతోనే ఉంటాయి. అయితే A సర్టిఫికేట్ సినిమా కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేసే వస్తారు ఆడియన్స్. కానీ వాళ్ల అంచనాలకి మించే వయలెన్స్ సీన్లు ఉన్నాయి. కానీ ఆ వయలెన్స్‌ని కూడా ఆడియన్స్ కన్విన్స్ అయ్యే విధంగానే డైరెక్టర్ తీశాడు. దర్శకుడు అదిత్య ధార్ రాసిన స్క్రీన్ ప్లే, కథను ఎగ్జిక్యూట్ చేసిన తీరు మాటల్లో చెప్పలేం. అనుక్షణం కొత్త అనుభూతిని, ట్విస్టులను రివీల్ చేసిన విధానం ఈ సినిమాకు బలం చేకూర్చాయి. ప్రతీ ట్విస్ట్ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ఇక ఓవరాల్‌గా అయితే ధురంధర్ సినిమాని ఇష్టపడిన వాళ్లకి ఈ పార్ట్ 2 కూడా బాగా నచ్చే ఛాన్స్ ఉంది. అయితే అంత సేపు థియేటర్లో కూర్చోలేం అనేవాళ్లకి మాత్రం కాస్త ల్యాగ్ అనిపించొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు! థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది.
ఇవి కూడా చదవండి






