కరుప్పు సమస్యల కోసం రంగంలోకి దిగిన సూర్య
తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన తాజా చిత్రం కరుప్పు(Karuppu) విడుదలకు ముందు ఊహించని అడ్డంకులు ఎదుర్కొనడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య ఈ రోజు ఉదయం 9 గంటల షోలతో విడుదల కావాల్సిన ఈ మాస్ ఎంటర్టైనర్, ఆర్థిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో నిలిచిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా ఫైనాన్షియర్లతో నెలకొన్న వివాదాల వల్ల థియేటర్లలో షోలు ప్రారంభం కాలేకపోయాయి. అయితే పరిస్థితి తీవ్రంగా మారడంతో హీరో సూర్య స్వయంగా రంగంలోకి దిగి ఫైనాన్షియర్లతో చర్చలు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
సూర్య ఇచ్చిన హామీల తర్వాత సమస్యలు క్రమంగా సద్దుమణుగుతున్నాయని, మధ్యాహ్నం షోల నుంచి సినిమా సాధారణంగా ప్రదర్శితమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్లు, పోస్టర్లు, సూర్య డ్యూయల్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందే ఇలాంటి సమస్యలు రావడం అభిమానులను నిరాశకు గురి చేసినా, చివరికి సినిమా రిలీజ్ దిశగా అడుగులు పడటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.
డైరెక్టర్ ఆర్జే బాలాజీ(RJ Balaji) తెరకెక్కించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) నిర్మించింది. సినిమాలో త్రిష కృష్ణన్(Trisha Krishnan), యోగి బాబు(Yogi Babu), నటరాజన్ సుబ్రమణ్యం(nataerajan subramanyam), స్వాసిక(Swasika), సుప్రీత్ రెడ్డి(Supreeth reddy) కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్(Sai Abhyankar) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మరో ప్రధాన బలంగా నిలుస్తాయని చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న కరుప్పు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.






