రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) ప్రస్తుతం తన కెరీర్లో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు రెమ్యునరేషన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే రవితేజ, ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, రవితేజ తన నెక్ట్స్ సినిమాల ఎంపికలో కూడా స్పీడ్ పెంచారు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ(Vivek Athreya) చెప్పిన ఓ మాస్ ఎంటర్టైనర్ కథకు రవితేజ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. అసలు ఈ కథను ముందుగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కోసం రెడీ చేసినప్పటికీ, ఆయన ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. దీంతో వివేక్ అత్రేయ అదే కథను రవితేజకు వినిపించగా, ఆయన వెంటనే ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండటం విశేషం.
మరోవైపు, రవితేజ యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి(Hashit Goli) దర్శకత్వంలో మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) నిర్మించనుంది. ఆసక్తికర విషయమేంటంటే, ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను రవితేజ సమాంతరంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వరుస ప్రాజెక్టులతో పాటు కొత్త వ్యాపార ధోరణిని అనుసరిస్తున్న రవితేజ, తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






