డైరెక్టర్ అవతారమెత్తుతున్న రామ్
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన ఎనర్జీ, మాస్ ఇమేజ్‌తో గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని(ram pothineni) ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. గతంలో ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar), రెడ్(Red) వంటి సినిమాలతో తనలోని వైల్డ్ మాస్ యాంగిల్‌ను బయటపెట్టిన రామ్, తాజాగా మరో ఇంటెన్స్ ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో రక్తంతో తడిసిన మైక్ పట్టుకుని కనిపించిన రామ్ లుక్ అభిమానుల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా భారీ ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్ డిజైన్, బ్యాక్‌డ్రాప్ చూస్తుంటే ఇది పూర్తి స్థాయి రా అండ్ రగ్గడ్ మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మే 15 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రామ్ బర్త్‌డే సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ సినిమాపై పలు ఆసక్తికర గాసిప్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కథను స్వయంగా రామ్ పోతినేని సిద్ధం చేశాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా రామ్ డైరెక్టర్ గా కూడా మారే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే హీరోగా మాత్రమే కాకుండా క్రియేటివ్ మైండ్‌గా కూడా రామ్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టవుతుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో కంటెంట్ ఆధారిత మాస్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో రామ్ తీసుకుంటున్న ఈ స్టెప్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా, రామ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీపై ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపటి అధికారిక ప్రకటనతో ఈ సినిమా జానర్, దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలపై పూర్తి క్లారిటీ రానుంది.






