రూమర్లపై స్పందించిన ప్యారడైజ్ టీమ్
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్(The Paradise) గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల గాసిప్స్, ఊహాగానాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారాలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు(Mohan Babu), రాఘవ్ జుయల్(Raghav Juyal), కయాదు లోహర్(Kayadu Lohar), సొనాలి కులకర్ణి(Sonali Kulkarni) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి రోజు నుంచే పూర్తి ప్రణాళికతో సినిమాను రూపొందిస్తున్నామని మేకర్స్ వెల్లడించారు.
సినిమా నిర్మాణం గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఇప్పటికే 100కు పైగా షూటింగ్ రోజులు విజయవంతంగా పూర్తి చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ముఖ్యంగా రీషూట్స్ జరుగుతున్నాయన్న వార్తలను పూర్తిగా ఖండించింది. ఇప్పటివరకు ఒక్క రీషూట్ కూడా జరగలేదని, ఫ్యూచర్ లో కూడా అలాంటి అవసరం ఉండదని స్పష్టం చేసింది. డైరెక్టర్ ఊహించిన విజన్‌కు ఏమాత్రం భంగం కలగకుండా భారీ స్థాయిలో షూటింగ్ కొనసాగుతోందని, ప్రతి సన్నివేశాన్ని అత్యంత కచ్ఛితత్వంతో తెరకెక్కిస్తున్నామని పేర్కొంది.
అధికారిక ప్రకటనలనే నమ్మాలని, అసత్య ప్రచారాలను ప్రోత్సహించవద్దని నిర్మాతలు మీడియా మరియు అభిమానులను కోరారు. ఇకపై సినిమాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వాటికి నేరుగా స్పందిస్తామని హెచ్చరించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21, 2026న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.






