కళా తపస్వికి అరుదైన గౌరవం
కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తనదైన శైలిలో చిత్రాలను తెరకెక్కించి తెలుగుతెరపై తిరుగులేని ముద్రవేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 2016 సంవత్సరానికి గాను విశ్వనాథ్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 1957లో తోడికోడలు చిత్రంలో సౌండ్ విభాగంలో సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆత్మగౌరవం చిత్రం ద్వారా తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడయ్యారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. సిరి సిరిమువ్వ చిత్రంతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విశ్వనాథ్ చిత్రాల్లో శంకరాభరణం ఓ కలికితురాయి అని చెప్పాలి. ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది ఆ చిత్రం. సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ప్రతిదీ ఆణిముత్యమే. స్వాతిముత్యం సినిమా ఆస్కార్ అవార్డుకు అధికారిక ప్రవేశం పొందడం విశేషం. భారతీయ సినిమాకు విశ్వనాథ్ చేసిన కృషిగాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన విశ్వనాథ్ నటుడిగా తనదైన ముద్రవేశారు.













