Asish Vidyarthi: ఇక మీదట అలాంటి పాత్రలే చేస్తా

ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసిన ఆశిష్ విద్యార్ధి(Asish Vidyarthi) గత కొన్నాళ్లుగా ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. ఆయనకు అవకాశాలు రాక ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదా మరేదైనా కారణముందా అని అందరూ అనుకుంటున్న టైమ్ లో ఆయన తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో పలు విషయాలను షేర్ చేసుకున్నారు.
ఆడియన్స్ తనను, తన యాక్టింగ్ ను మిస్ అవుతున్నారని తనకు తెలుసని, కెరీర్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించి గొప్ప నటుడిని అనిపించుకున్నానని, కానీ తనకు అన్నీ ఒకే తరహా పాత్రలొస్తున్నాయని, ఇక మీదట అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు ఆశిష్ విద్యార్ధి తెలిపారు. ఇప్పటివరకు కెరీర్లో చేయని కొత్త పాత్రలు వస్తేనే చేస్తానని అన్నారు.
అలాంటి ప్రత్యేక పాత్రల కోసమే తాను వెయిట్ చేస్తున్నానని, కథలో ముఖ్యంగా ఉండే పాత్రలు దొరికితేనే నటిస్తానని, ఇదే విషయాన్ని తాను దర్శకనిర్మాతలకు కూడా చెప్పానన్నారు. 30 ఏళ్ల కెరీర్లో 300కు పైగా ఎన్నో సినిమాలు చేశానని, నటుడిగా తనకు అది చాలని, ఇక మీదట అయినా కొత్తదనం చూపించాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ఆశిష్ విద్యార్ధి.