Santhana Prapthirasthu: “సంతాన ప్రాప్తిరస్తు” క్యూట్ లవ్ స్టోరీతో సాగే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – నిర్మాతలు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు” (Santhana Prapthirasthu). ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ
– నేను, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పదేళ్లుగా కలిసి జర్నీ చేస్తున్నాం. నేను నిర్మించిన “లేడీస్ అండ్ జెంటిల్ మేన్” మూవీకి రైటర్ గా పనిచేశాడు. ఆ సినిమాకు అప్పటి ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాల్లో తృతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలికి అవార్డ్ వచ్చింది. నవీన్ నూలికి ఎడిటర్ గా తొలి చిత్రమది. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ దర్శకత్వంలో ఏబీసీడీ రూపొందించాం. సంజీవ్ అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ కూడా చేశాడు. ఈ స్క్రిప్ట్ ను సంజీవ్ బాగా హ్యాండిల్ చేశారు. మేము 50 రోజులు షూటింగ్ అనుకుంటే ఆల్ మోస్ట్ అనుకున్నది అనుకున్నట్లే చిత్రీకరణ జరుపుతూ వెళ్లాడు. ఏ కారణంతోనూ సినిమా షూటింగ్ ఆలస్యం కాలేదు. వర్షం కారణంగా ఒకట్రెండు రోజులు షూటింగ్ ఆపాం. అలా మొత్తం 56 డేస్ లో “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా షూటింగ్ పూర్తి చేశాం.
– “సంతాన ప్రాప్తిరస్తు” స్క్రిప్ట్ ను కొందరు పేరున్న హీరోలకు చెప్పాం. హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ అంశం వల్ల వాళ్లు ఇమేజ్ కు ఇబ్బంది అవుతుందని మూవీ చేయలేదు. బాలీవుడ్ లో ఆయుశ్మాన్ ఖురానా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూ స్టార్ గా ఎదిగాడు. మనవాళ్లు కూడా ఆయనలా ప్రయత్నించవచ్చు. ఆ తర్వాత కొత్త అబ్బాయితో వెళ్దాం ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్ ను తీసుకున్నాం.
– మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సినిమా ఉన్నా, మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. కామెడీ ఎక్కడా కావాలని ఇరికించినట్లు ఉండదు. చాలా ఆర్గానిక్ గా ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ ఎంటర్ టైన్ మెంట్ ఎలా ఉంటుందో అలాంటి ఫన్ క్రియేట్ చేశాం. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్..ఇలా కాస్టింగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తారు. స్క్రిప్ట్ వరకే నేను ఇన్వాల్వ్ అయ్యాను. డైరెక్షన్ మొత్తం సంజీవ్ చూసుకున్నాడు. మంచి లవ్ స్టోరీ, ఎమోషన్ ఉన్న క్లీన్ ఎంటర్ టైనింగ్ మూవీ మాది. సామజవరగమన తర్వాత మళ్లీ తెలుగులో వస్తున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు”.
– ఈ సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. మంచి మెసేజ్ చేరుతుంది. మనం ఈ సమస్య కోసమా ఇంత బాధపడింది అనుకుంటారు. టైటిల్ విషయంలో మొదట్లే ఏంటీ టైటిల్ అనుకునేవారు కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యాక “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టైటిల్ బాగుంది అంటున్నారు. స్క్రిప్ట్ దశలో నాకు, సంజీవ్ కు ఫస్ట్ వచ్చిన టైటిల్ సంతాన ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని ముందుగా టైటిల్ అనుకున్నా, అది లెంగ్తీగా ఉందని “సంతాన ప్రాప్తిరస్తు” ఫిక్స్ చేశాం.
– పాండమిక్ ముందు మనకు వరల్డ్ సినిమా తెలియదు. కరోనా టైమ్ లో మనమంతా ఓటీటీల్లో డిఫరెంట్ జానర్స్ కంటెంట్ చూశాం. గతంలో తెలుగులో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్ తో మూవీస్ ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఆదరణ పొందలేదు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్, ట్రెండ్ మారింది. “సంతాన ప్రాప్తిరస్తు” ట్రైలర్ ను ఓ నాలుగేళ్ల కిందట అయితే నేను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఇది సీక్రెట్ గా చర్చించుకునే విషయం కాదు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో అత్యధిక ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. మన సొసైటీలో ఉన్న ఈ సమస్య గురించి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో “సంతాన ప్రాప్తిరస్తు” 2 చేయాలనుకుంటున్నాం.
– మా మూవీని మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చెబుతున్నాం. ఎందుకంటే సినిమాలోని పాటలన్నీ హిట్ అయ్యాయి. మా మూవీ మ్యూజిక్ ఆలిండియాలో 15వ ప్లేస్ లో ట్రెడ్ అవుతుంటే, ట్రైలర్ ఆలిండియాలో 32వ ప్రేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇతరుల పాటల్ని తమ మూవీస్ లో వాడుకుంటే తప్పకుండా ఎన్ వోసీ తీసుకోవాలి. మా మధుర ఆడియో సాంగ్స్ ను ఇతరుల మూవీస్ లో ఉపయోగించుకుంటామని అడిగితే నేనెప్పుడు డబ్బులు ఛార్జ్ చేయలేదు. మిగతా ఆడియో కంపెనీస్ పెద్దఎత్తున ఛార్జ్ చేస్తుంటాయి. పాత పాటల్లో ఏ చిన్న బిట్ ఉపయోగించుకున్నా ఎన్ వోసీ తీసుకోవడం మంచిది.
– కంటెంట్ బాగున్న సినిమాలకు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. “సంతాన ప్రాప్తిరస్తు” లాంటి చిన్న సినిమా దాదాపు 300 థియేటర్స్ లో రిలీజ్ అవుతోందంటే ట్రైలర్ ఆకట్టుకోవడం వల్లే. డిజిటల్ బిజినెస్ కూడా కంప్లీట్ చేసుకోగలిగాం. అన్ని ఏరియాల్లో మెయిన్ థియేటర్స్ దొరికాయి. మా మూవీని యూఎస్ లో దాదాపు 200 లొకేషన్స్ లో పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు రిలీజ్ చేస్తున్నారు. మా సినిమా ట్రైలర్ చూసి ఆయన యూఎస్ లో మూవీని రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.
– నేటివ్ గా ఆదరణ పొందితే ఆ సినిమానే గ్లోబల్ గా పేరు తెచ్చుకుంటుంది. నేల విడిచి సాము చేయడం నాకు ఇష్టం ఉండదు. “సంతాన ప్రాప్తిరస్తు” తెలుగులో మంచి విజయం సాధించాక, ఆ క్రెడబిలిటీతో పాన్ ఇండియాకు రీచ్ అవుతుంది. నాకు పెద్ద సినిమాల కంటే చిన్న చిత్రాలను నిర్మించడమే కంఫర్ట్ గా ఉంటుంది. కంటెంట్ బేస్డ్ గా సాగే క్యూట్ మూవీ ఇది. హానెస్ట్ గా అటెంప్ట్ చేశాం. ఇష్యూ బేస్డ్ కథ అయినా ఎంటర్ టైన్ మెంట్ తో వెళ్తూ ఆకట్టుకుంటుంది. ఫిలిం మేకింగ్ లో అందరం తప్పులు చేస్తాం. కానీ కథ ఎంచుకునే విధానంలోనే ఆ ఫిలింమేకర్ ఇంటెన్షన్ తెలుస్తుంది. వారి ప్రయత్నంలో నిజాయితీ ఉందని అనిపిస్తే సపోర్ట్ చేయండి.
– “సంతాన ప్రాప్తిరస్తు” రిలీజ్ అయ్యాక, ఆనంద్ దేవరకొండ డ్యూయెట్ సినిమా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేస్తాం. 12 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత నెక్ట్స్ ఇయర్ నా డైరెక్షన్ లో మూవీ గురించి ప్లాన్ చేస్తా. పాండమిక్ టైమ్, ఇప్పుడు ఓటీటీ డీల్స్ లో, రేట్స్ లో తేడాలు వచ్చాయి. ఏవైనా తప్పులు జరిగి ఉంటే ఇప్పుడు ఓటీటీ, ఇండస్ట్రీ రెండు వైపులా సరి చేసుకుంటున్నారు. హ్యూజ్ ప్రైస్ కు తీసుకున్న సినిమాల్లో డిజాస్టర్ అయితే ఓటీటీ వాళ్లు పేమెంట్ తగ్గిస్తున్నారు. అయితే అది అతి తక్కువ మూవీస్ విషయంలోనే జరిగింది. అగ్రిమెంట్ లో ఉన్నట్లే డీల్ చేసుకోవాలి. మనకున్న 8 మేజర్ ఓటీటీలకు స్టార్ హీరోస్ చేసే పెద్ద సినిమాలు కావాలి. అలాగే కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు కూడా కావాలి. ఓటీటీలకు కావాల్సినంత మంచి కంటెంట్ దొరకడం లేదు. మంచి కంటెంట్ కోసం డిమాండ్ ఉంది. లిటిల్ హార్ట్స్, ప్రీ వెడ్డింగ్ షో వంటి చిన్న చిత్రాలకు ఓటీటీ బిజినెస్ బాగా జరిగిందంటే అందుకు వాటిలోని కంటెంట్ కారణం. చిన్న చిత్రాలకు రిలీజ్ ముందు ఓటీటీ బిజినెస్ జరగకున్నా, రిలీజ్ అయ్యాక వచ్చే సక్సెస్ తో ఓటీటీలు తీసుకుంటున్నాయి.
నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ
– “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాతో నిర్మాతగా మీ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. నేను ఐటీ సెక్టార్ నుంచి వచ్చాను. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఐటీ ఎంప్లాయ్ నేపథ్యంగా ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్స్ అంతా బాగా రిలేట్ అవుతున్నారు. ట్రైలర్ వాళ్లకు బాగా నచ్చింది. సెన్సబుల్ ఇష్యూను, సెన్సిటివ్ గా చూపిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఈ సినిమాను ప్రారంభించాం.
– యూఎస్ లో మాది సక్సెస్ ఫుల్ కంపెనీ. అమెరికాలో టాప్ 200 కంపెనీస్ లో తెలుగు వారివి నాలుగు కంపెనీలు ఉన్నాయి. అందులో మా ఫ్రెండ్లీ కన్సల్టెన్సీ ఒకటి. అలా సక్సెస్ ఫుల్ గా ఉండి, స్థిరపడి, ఎంతో అనుభవం ఉన్న మేము 2003 నుంచి ఫ్రెండ్లీ వెల్ఫేర్ పేరుతో ఎన్ జీవోను రన్ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవన్నింటి నేపథ్యంతో మన యువతకు ఏదైనా ఒక మంచి కథను చెప్పాలి అని, ఇండస్ట్రీలో దశాబ్దంన్నర అనుభవం ఉన్న మధుర శ్రీధర్ గారితో, హీరో విక్రాంత్ తో కలిసి “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను చేశాం. మేల్ ఫెర్టిలిటీ ఇష్యూతో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎక్కడా అసభ్యత లేకుండా, ఎవర్నీ విమర్శించకుండా, హద్దులు దాటకుండా, బలమైన కథతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నిర్మించాం.
– పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు…మా సినిమా పేరుకే చిన్నది కానీ ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది, ఎక్కువమందికి రీచ్ అవుతుంది. మా లాంటి చిన్న మూవీస్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు, హానెస్ట్ గా అటెంప్ట్ చేసే మూవీస్ కు మీడియా మిత్రుల నుంచి ఇంకాస్త సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నం. మీరు ఆదరిస్తే మరిన్ని ఇలాంటి మంచి చిత్రాలు చేసే హోప్ వస్తుంది. మధుర శ్రీధర్ గారితో మా అసోసియేషన్ కంటిన్యూ అవుతుంది.
– నాలా యూఎస్ లో ఉన్న తెలుగు ఐటీ సెక్టార్ వాళ్లకు మూవీస్ లో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో సినిమా చేయడం సులువే కానీ దాన్ని బిజినెస్ చేయడం కష్టం. ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వారితో అసోసియేట్ అయితేనే మూవీని సేల్ చేసి ఫైనాన్షియల్ గా సేఫ్ కాగలం. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో కొత్త వాళ్లను ప్రోత్సహించేందుకు త్వరలో డెబ్యూ అవార్డ్స్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేస్తున్నా. చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్ కు మావంతు ప్రోత్సాహం అందించాలని అనుకుంటున్నాం.







