విశ్వనాథుడికి దాదాసాహెబ్ పురస్కారంపై స్పీకర్ హర్షం
కళాతపస్వి కె.విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికవడంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అనే సినిమాలు తీసిన విశ్వనాథ్‌కు ఈ పురస్కారం దక్కడం తెలుగువారికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. మన సంప్రదాయాలు, సంగీతం, నాట్యం వంటి కళల్ని కథాంశంగా తీసుకుని అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గుంటూరు జిల్లా పెదపులివర్రుకు చెందిన వ్యక్తి కావడం తమకు గర్వకారణమన్నారు. ఆయన తీసిన సినిమాలు చూసి కళలపై మక్కువ పెంచుకుని, ఎంతోమంది సంగీతం, నాట్యం నేర్చుకున్న వాళ్లు ఉన్నారని స్పీకర్ కోడెల అన్నారు. ఎక్కడా హద్దులు దాటని సాహిత్యం, మనసు కు హాయి అనిపించే సంగీతంలో ఆయన తీసిని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. నటనలో సహజత్వం ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆయన చిత్రాలంటే తనకెంతో ఇష్టమని కోడెల పేర్కొన్నారు.













