మీరేనా.. మేమూ చేస్తాం : అమెరికా
చైనాకు చెందిన విమాన సర్వీసులను అమెరికా రద్దు చేసింది. నాలుగు చైనా విమానయన సంస్థలకు చెందిన 26 విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 28 మధ్య ఈ విమానాలు నడవాల్సి ఉంది. ఇటీవల కోవిడ్ 19 కేసులను కారణంగా చూపి అమెరికా విమానయాన సంస్థలకు చెందిన విమానాలను చైనా రద్దు చేసింది. సరిగ్గా చైనా ఎన్ని విమానాలు రద్దు చేసిందో అన్నే విమానాలను అమెరికా తాజాగా రద్దు చేసింది. రద్దైన విమానాల్లో జియోమెన్, ఎయిర్ చైనా, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ సంస్థలకు చెందిన విమానాలు ఉన్నాయి.
లాస్ ఏంజెలెస్ నుంచి బయల్దేరాల్సిన 19 విమానాలు, న్యూయార్క్ నుంచి బయల్దేరాల్సిన 7 విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలను ఇటీవల చైనా రద్దు చేసింది. దానికి ప్రతిగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్ష్పోర్టేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.






