అమెరికాలో 2008 తర్వాత… మళ్లీ అత్యధిక స్థాయికి
అమెరికాలో సగటు దీర్ఘకాల గృహ తనఖా రేట్లు ఈ వారం 6 శాతం కంటే పెరిగాయి. 2008లో గృహ రుణ సంక్షోభం అనంతరం మళ్లీ రేట్లు ఆ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఫలితంగా గృహ కొనుగోళ్ల నుంచి మరింత మంది దూరంగా జరుగుతారేమోన్న భయాలు కనిపిస్తున్నాయి. 30 ఏళ్ల కాలానికి వడ్డీ రేటు 5.89 శాతం నుంచి 6.02 శాతానికి పెరిగిందని గృహ తనఖా సంస్థ ఫ్రెడ్డీ మ్యాక్ పేర్కొంది. ఒక ఏడాది కాలంలో దీర్ఘకాల సగటు రేటు రెట్టింపు కావడం గమనార్హం. ఏడాది కిందట తనఖా వడ్డీరేటు 2.86 శాతం మాత్రమే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుండడంతో, గృహ మార్కెట్కు గిరాకీ తగ్గుతోంది. పెరిగిన వడ్డీ రేట్ల ఫలితంగా నెలావారీ వాయిదా చెల్లింపులకు వందలకొద్దీ డాలర్లు అదనంగా కట్టాల్సి వస్తున్నందున, చాలా మంది ఇళ్ల కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకుంటున్నారు. వరుసగా ఆరు నెలల పాటు గృహ విక్రయాలు పడిపోతూ వస్తున్నాయి.






