USA-China: అసలే నష్టాల్లో బోయింగ్.. ఆపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్..?

ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థ బోయింగ్ (Boeing) పుట్టి మునగనుందా…? ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న సంస్థపై ట్రంప్ (Trump) సుంకాలు పిడుగుపాటులా మారనున్నాయా..? ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలతో.. బోయింగ్ కు ఆర్డర్లు కరువయ్యాయి. అంటే చైనా .. ఇటీవలి కాలంలో ఎలాంటి ఆర్డర్లు .. బోయింగ్ సంస్థకు ఇవ్వడం లేదు. ఫలితంగా ఆ సంస్థ వ్యాపారం దారుణంగా దెబ్బతిందని చెప్పవచ్చు.
అమెరికా వస్తువులపై 125 సుంకాలను విధిస్తూ చైనా ఇటీవల ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల విడిభాగాలను దిగుమతి చేసుకోవద్దని పలు సంస్థలకు సూచించింది. ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ కూడా చైనా సంస్థలకు భారంగా మారనుంది. అదే సమయంలో ఇప్పటికే బోయింగ్ నుంచి విమానాలను లీజుకు తీసుకొని నిర్వహిస్తున్న సంస్థలను ఆదుకొనే దిశగా చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
చైనా-అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. ఆ సంస్థకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. రానున్న 20 ఏళ్లలో ప్రపంచ విమానాల మార్కెట్‌లో 20శాతం వాటా చైనాదే అన్న అంచనాలున్నాయి. ఒక్క 2018లోనే 25శాతం బోయింగ్ విమానాలను బీజింగ్ సంస్థలు కొనుగోలు చేశాయి. కానీ, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా గత కొన్నేళ్లుగా చైనా నుంచి ఎటువంటి కొత్త ఆర్డర్లు బోయింగ్‌కు లభించలేదు.దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ టారిఫ్‌లపై చైనా ప్రతిఘటించడంతో అమెరికాలో ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే.. చైనా దిగుమతి వస్తువుల రేట్లు చాలా ఎక్కువగా ఉండనున్నాయి.
మరోవైపు…బోయింగ్ (Boeing) భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నది. ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సిబ్బందిలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు, ఉత్పత్తి ఆలస్యం కావడంతో బోయింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులు స్థానికత నిబంధనలకు అనుగుణంగా 60 రోజుల నోటీసు పీరియడ్‌కు అనుగుణంగా వచ్చే జనవరి వరకూ ఉద్యోగాల్లో కొనసాగుతారు.
ఇటీవలి కాలంలో సియాటెల్ ప్రాంతంలో 33 వేల మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేయడంతో 737 మ్యాక్స్, 767, 777 జెట్ విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె వల్ల మూడో త్రైమాసికంలో 500 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని బోయింగ్ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులకు ఉద్వాసన తెలపడమే మార్గంగా భావిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక పూర్తి ప్రాధాన్య అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని బోయింగ్ పేర్కొంది. కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.