Mcdonalds :హైదరాబాద్‌లో మెక్ డోనాల్డ్ గ్లోబల్ ఆఫీస్
అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ (Mcdonalds) గ్లోబల్ ఆఫీసు హైదరాబాద్‌లో ఏర్పాటైంది. హైటెక్ సిటీలో 1.56 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తో కలిసి ప్రారంభించారు. అమెరికాకు వెలుపల తమ అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన మెక్ డొనాల్డ్స్ లీడర్‌షీప్ కు మంత్రి శ్రీధర్‌బాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మెక్ డొనాల్డ్స్ అంటే గ్లోబలైజేషన్‌కు నిలువెత్తు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ జీసీసీ హబ్ (GCC Hub) యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షిస్తోంది. కేవలం టెక్నాలజీకి సంబంధించిన జీసీసీలనే కాక, అన్ని రంగాల జీసీసీలనూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. హాస్పిటాలిటీ రంగ దిగ్గజ సంస్థ మారియట్ తన మొదటి జీసీసీని ప్రారంభించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనకు మా ప్రభుత్వం మెక్ డొనాల్డ్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యమిస్తోంది అని ఆయన వివరించారు.







