ఎలాన్ మస్క్ కు ఉద్యోగుల హెచ్చరిక
ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకుంటే 75 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలపై మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులు మండిపడ్డారు. భారీ తొలగింపులు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎలాన్ మస్క్‌కు వారు బహిరంగ లేఖ రాశారు. భారీగా ఉద్యోగాలను తొలగించాలనే మస్క్ నిర్ణయంపై అభ్యంతరం తెలిపారు. 75 శాతం మంది ఉద్యోగుల తొలగింపు ట్విటర్ వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. ట్విట్టర్లో హానికర కంటెంట్‌ను నియంత్రించే సామర్థ్యం, భద్రతా సమస్యలను ఎదుర్కోవడం లాంటి వాటిపై ప్రభావం పడుతుందన్నారు. నిరంతరం వేధింపులు, బెదిరింపుల మద్య తాము పనిచేయలేమని పేర్కొన్నారు. కార్మికులందరికీ న్యాయమైన పని విభజన విధానాలుండాలని డిమాండ్ చేశారు. రిమోట్ వర్క్‌తో సహా ఇప్పుడున్న ఉద్యోగుల ప్రయోజనాలను అలాగే ఉంచాలని మస్క్‌కు విన్నవించారు.






