బహమాస్… ఓ చిన్న ఐలాండ్..
20 ఏళ్ల తెలుగు టైమ్స్ జర్నీలో చాలా మంది బహమాస్ వెళ్లామని లేదా వెళ్లాలని చెప్పటం వలన ఆ బహమాస్ మనం కూడా వెళ్ళాలి అని నా విష్ లిస్ట్‌లో వేసుకున్నాను. చాలా రోజుల తరువాత… నేనూ – లక్ష్మి ఓ చిన్న హాలిడే చెయ్యాలని అనుకోవటం, బహమాస్ ట్రిప్‌ని ఫైనల్ చేసుకోవడం జరిగింది.
బహమాస్ ఓ చిన్న ఐలాండ్… మొత్తం జనాభా ఓ 4 లక్షలు.. మేము వెళ్ళిన ఆ దేశ రాజధాని Nassauలో 2,25,000 వున్నారుట. అమెరికా లో ఈస్ట్ కోస్ట్ నుంచి ఫ్లోరిడా, న్యూ జెర్సీల నుంచి ఫ్లైట్స్ వున్నాయి. 6 సెప్టెంబర్ నుంచి 9 సెప్టెంబర్ వరకు అక్కడ శాండీ పోర్ట్ బీచ్ రిసార్ట్స్‌లో రూం కూడా బుక్ చేసుకున్నాం. ఒక కొత్త దేశం వస్తే వుండే ఇమ్మిగ్రేషన్ తతంగం తరువాత బయటకు వచ్చాం.
ఓ చిన్న టౌన్ లాగా… ఎటు నుంచి ఎటు తిరిగినా 5-7సఎ లు, 20-30 నిముషాలు. మాంచి ఇన్నోవా సైజ్‌లో వుండే టాక్సీలు, ఫిక్స్డ్ రేట్స్… సో తిరగటానికి ప్రాబ్లెమ్ లేదు.. పక్క పక్కనే ప్యారడైజ్ ఐలాండ్, బ్లూ లగూన్ ఐలాండ్లాంటి పిల్ల ద్వీపాలు (ఐలాండ్స్) కూడా వున్నాయి. అన్నీ చిన్న చిన్న 1 లేదా 2 అంతస్తుల.. పాత యూరోపియన్ పద్దతిలో ఇళ్లు. చిన్న చిన్న రోడ్స్.. మధ్యలో రెడ్ – గ్రీన్ లైట్ లాంటి రౌండ్ టన్నాలు, పద్దతిగా వెళ్ళే ట్రాఫిక్… ముచ్చటగా వుంది. జనాభ చూస్తే… చాలా వరకు నల్లవాళ్ళు (కెరెబియన్ ఐలాండ్… అంటే వాళ్ళే కదా), సాధారణ కింద లేదా మధ్య తరగతి జీవితం గడుపుతున్నారు అనిపించింది. అయితే టూరిస్ట్‌లు, పెద్ద వాళ్ళు వస్తారు కనుక పెద్ద పెద్ద హోటళ్ళు, రిసార్ట్లు, క్యాసినోలు, డైమండ్ జ్యువలర్ షాప్‌లు వున్నాయి. బర్గర్ కింగ్, పిజ్జా హట్, స్టార్ బక్స్ లాంటి బ్రాండ్స్ అన్నీ వున్నాయ్.
ఇక బహమాస్ ఎందుకు అంత ఫేమస్ అంటే…
అందంలో నీలాకాశంతో పోటీ పడేలా… నీల రంగులో నిర్మలంగా వుండే సముద్రం… అంటే అలలతో వుండే వృద్దుతమైన సముద్రుడు లేడు ఇక్కడ… ఓ 1000 గజాలు కూడా లోపలికి నడుచు కొంటూ.. కింద నేల (బాటమ్) చూసుకొంటూ వెళ్లొచ్చు చాలా చోట్ల.. తెల్లని ఇసుకతో వున్న బీచ్… క్లేయర్ వాటర్‌తో సముద్రం కనుక అందరూ సముద్రలో స్నానం చెయ్యటానికి, ఆడుకోవటానికి వస్తారు. బికినీలు, షార్ట్‌లు, హావయ్ స్లిప్పర్, హాట్స్లు అమ్మే వాళ్ళు, రెలాక్సింగ్గా పడుకోవటానికి చైర్స్, పెద్ద గోడుగులు అద్దె కిచ్చే వాళ్ళు వుంటారు అన్నీ చోట్ల. అందరూ వెళ్ళటానికి నీళ్ళలో తిరిగే మోటార్ బోట్లు, ఒక్కొక్కళ్లు వెళ్ళటానికి మోటార్ స్కూటర్లు వుంటాయి. ఇంకా కొంచెం లోపలికి తీసుకెళ్ళి డాల్ఫిన్స్‌ని చూపించే, లేదా వాటితో ఆటలు ఆడుకొనిచ్చే ఏర్పాట్లు కూడా వున్నాయి. ఇంకా ముఖ్యంగా నీళ్ళ లోపలికి తీసుకెళ్ళి (కళ్ళకి సేఫ్టీ గాగుల్స్, నోటికి ఆక్సిజన్ సరఫరా చేసే గొట్టం, నడుముకి సేఫ్టీ అటాచ్మెంట్) స్నోర్కెలింగ్ చేయించే ఏర్పాట్లు కూడా వున్నాయి. (అంటే సముద్ర గర్భంలోకి, అడుగులోకి వెళ్లి అక్కడ వున్న కొరల్స్ని, వివిధ రకాల చేపలను, ఇతర జీవులను చూడటం అన్న మాట).
అన్నింటికంటే చిత్రమైన ప్రత్యేకత… ఇక్కడ నీళ్లలో తిరిగే పందులు… వాటిని పట్టుకొని సముద్రంలో టూరిస్ట్‌లు ఈత కొట్టటం, ఆడుకోవడం..
అలాగే ఇక్కడ రమ్ చాల పాపులర్.. తయారవడమే కాదు.. వాడటం కూడా ఎక్కువే.. ఇక్కడ సైట్ సీయింగ్ ఆర్గనైజర్లు వచ్చిన టూరిస్ట్‌లను సిటీలో ఫుడ్ ఫెస్టివల్ (365 రోజులు ఉంటుంది)కి తీసుకెళ్లి ఇక్కడ తయారయ్యే ఫుడ్‌ని రమ్ని టేస్ట్ చెయ్యమంటారు. ఇక్కడ రమ్‌తో చేసిన కేక్‌లు (రమ్ కేక్) కూడా అన్నీ సైజులలో,,, అన్ని షాప్‌లలో దొరుకుతాయి.
మేము తీసుకొన్న శాండీ పోర్ట్ బీచ్ రిసార్ట్ కూడా పెద్దదే.. ప్రముఖమైనదే… మా రూమ్ వెనకే బీచ్… అంటే..10-15 అడుగులు వేస్తే… శుభ్రమైన… స్నానం చెయ్యటానికి, ఈత కొట్టడానికి, ఆడుకోవటానికి సముద్రం… కూర్చొని సీనరీని ఆస్వాదించాలంటే వీలుగా ఈజీ చైర్లు, కొబ్బరి చెట్లకు కట్టిన వూయలలు… ఇంకా ఓ 1000 గజాలు నడిస్తే దట్టమైన సముద్రం.. కొంత దూరం ఏర్పాటు చేసిన వుడెన్ కట్టడం… చివరలో సీటింగ్ ఏర్పాటు. ఇలాంటి ఏర్పాట్లు ఇతర బీచ్‌లలో కూడా వుంటాయి కానీ… ఇంత ప్రైవేట్‌గా… కేవలం మన కోసమే అన్నట్టుగా వుండవుగా….
మరీ సముద్రం లోపలికి వెళ్ళే సాహసం చెయ్య లేదు కానీ, అన్నీ చూసి పూర్తి Satisfaction తో వెనక్కి వచ్చాం.
Bahamas definitely gave the value for the money spent.
TRAVELOGUE by
Chennuri Venkata Subba Row,
Editor, Telugu Times






